ప్రియురాలు చెప్పిందని.. | Sakshi
Sakshi News home page

ప్రియురాలు చెప్పిందని..

Published Tue, Jun 4 2019 8:57 AM

Two Men Arrest in Robbery Case Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రియురాలితో కలిసి జల్సాలు చేయడానికి అవసరమైన డబ్బు కోసం ఆమె సలహా, సహకారంతో దోపిడీకి పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరొకరిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్‌ బాబు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంటూ భవన నిర్మాణ కూలీగా పని చేస్తున్నాడు. ఇతడికి అక్కడే సుమీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈమెకు పశ్చిమ బెంగాల్‌కే చెందిన బన్సీ కరుణాకర్‌తోనూ సన్నిహిత సంబంధం ఉంది. ఇతను ప్రస్తుతం తిరుమలగిరిలో నివసిస్తుండటంతో అతడిని కలిసేందుకు తరచూ నగరానికి వచ్చి వెళ్ళేది.

ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న బాబు వాటి నుంచి బయటపడటంతో పాటు సుమీతో కలిసి జల్సాలు చేయడానికి తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు. ఇదే విషయాన్ని ఆమెతో చెప్పడంతో హైదరాబాద్‌లో ఉండే కరుణాకర్‌ ఇంట్లో దోపిడీ చేద్దామంటూ సలహా ఇచ్చింది. అతడి వద్ద భారీగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో నగదు కూడా ఉండవచ్చునని చెప్పాంది. ఇందుకు అంగీకరించిన బాబు ఈ విషయాన్ని తన స్నేహితుడైన అబిద్‌ యూçహిద్‌ మిల్లాకు చెప్పాడు. తనకు సహకరిస్తే చోరీ సొత్తులో వాటా ఇస్తానంటూ ఎర వేశాడు. దీనికి అబిద్‌ అంగీకరించడంతో ఇటీవల ముగ్గురూ కలిసి సిటీకి చేరుకున్నారు. గత నెల 26న దోపిడీకి సిద్ధమైన ఇద్దరికీ కరుణాకర్‌ ఇంటిని దూరం నుంచి చూపించిన సుమీ అక్కడే ఆగిపోయింది. అదే రోజు సాయంత్రం ఇంట్లోకి ప్రవేశించిన బాబు, అబిద్‌ ఒంటరిగా ఇంట్లో టీవీ చూస్తున్న కరుణాకర్‌పై దాడి చేశారు. చేతులు వెనక్కు విరిచి కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కారు.

అనంతరం ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్, బంగారు, వెండి ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో, పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఇద్దరు అనుమానితుల్ని గుర్తించిన అధికారులు సాంకేతికంగా ముందుకు వెళ్ళిబాబు, అబిద్‌ నిందితులుగా నిర్ధారించారు. దీంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు జి.గుణశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్‌లతో కూడిన బృందం ముమ్మరంగా గాలించింది. సోమవారం ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం కేసును తిరుమలగిరి పోలీసులకు అప్పగించిన అధికారులు పరారీలో ఉన్న సుమీ కోసం గాలిస్తున్నారు.  

Advertisement
Advertisement