కిడ్నాప్‌ కథ సుఖాంతం | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కథ సుఖాంతం

Published Mon, Dec 10 2018 9:03 AM

Happy Ending in Boy Kidnap Case Hyderabad - Sakshi

అడ్డగుట్ట: ఎనిమిది నెలల బాలుడ్ని కిడ్నాప్‌ చేసిన నిందితులను  పోలీసులు అదుపులోకి తీసుకొని చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. రైల్వే ఎస్పీ అశోక్‌ కుమార్‌ తెలిపిన మేరకు.. సైదాబాద్‌కు చెందిన సుల్తానా తన భర్తతో కలిసి బిక్షాటన చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో నవంబర్‌ 29న లాలాగూడ రైల్వే స్టేషన్‌కు సుల్తానా తన భర్త, ఎనిమిది నెలల కుమారుడు ఈశ్వర్‌తో రాత్రి వచ్చి అక్కడే పడుకున్నారు. తెల్లవారుజామున లేచి చూసే సరికి కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే రైల్వే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు లాలాగూడ రైల్వే స్టేషన్‌ వద్దనున్న సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

రైల్వే అదనపు డీజీపీ  సందీప్‌ శ్యాండిల్సా ఆదేశాల మేరకు రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్‌ కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 8వ తేదీన రైల్వే పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్‌ ఆదిరెడ్డి నేతృత్వంలో ఎస్‌ఐ ప్రమోద్‌ ఇతర కానిస్టేబుళ్లు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 8 నెలల బాలుడు ఈశ్వర్‌ను కిడ్నాప్‌ చేసిన షేక్‌గౌస్‌(28) ఆటోడ్రైవర్, కోట రామకృష్ణ(40) ఫిల్మ్‌ ఇండస్ట్రీ అసిస్టెంట్‌ డైరెక్టర్, వొంకుదొత్‌ బికు(25) కంపెనీలో లేబర్, సంకటి లక్ష్మణ్‌(29) పెట్రోల్‌ బంక్‌ ఉద్యోగి, వేముల బాబురెడ్డి(42)మెడికల్‌ మార్కెటింగ్‌ ఉద్యోగి, ఈ ఐదుగురు నింధితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.   నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement