బ్యాంకింగ్ దన్ను- మార్కెట్‌ అప్‌ | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్ దన్ను- మార్కెట్‌ అప్‌

Published Mon, Jun 22 2020 3:57 PM

Sensex ends near 35000 points mark - Sakshi

దేశీ స్టాక్‌ మార్కెట్లలో వారాంతాన కనిపించిన జోష్‌ కొనసాగింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. చివర్లో కొంత మందగించినప్పటికీ 180 పాయింట్లను జమ చేసుకుంది. 34, 911 వద్ద ముగిసింది. నిఫ్టీ 67 పాయింట్లు బలపడి 10311 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35,213 వద్ద గరిష్టాన్ని తాకగా.. 34,794 వద్ద కనిష్టాన్ని చేరింది. ఇక నిఫ్టీ 10,394- 10228 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

ఐటీ మినహా 
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 4 శాతం పుంజుకోగా.. మెటల్‌, ఫార్మా, మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఆటో, రియల్టీ 2.6-1 శాతం మధ్య ఎగశాయి. ఐటీ 0.25 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోల్‌ ఇండియా, వేదాంతా, కొటక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఐవోసీ, గ్రాసిమ్‌, సిప్లా 7-3.2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే విప్రో, గెయిల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌ 1.7-0.4 శాతం మధ్య నష్టపోయాయి.

గ్లెన్‌మార్క్‌ స్పీడ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో గ్లెన్‌మార్క్‌ 28 శాతం దూసుకెళ్లగా.. ఐబీ హౌసింగ్‌ 20 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో ఐడియా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, ఆర్‌ఈసీ, పేజ్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 10-7 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఎల్‌ఐసీ హౌసింగ్‌ 6 శాతం పతనంకాగా, జీఎంఆర్‌, మహానగర్‌, రామ్‌కో సిమెంట్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, అమరరాజా, ఎస్కార్ట్స్‌ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2-1.4 శాతం చొప్పున పురోగమించాయి. ట్రేడైన షేర్లలో 1874 లాభపడగా.. 873 మాత్రమే నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1237 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 881 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.

Advertisement
Advertisement