6న వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం | Sakshi
Sakshi News home page

6న వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం

Published Sun, Jan 27 2019 4:40 AM

YSR Congress Party Samara Sankharavam Stars from Feb 6 - Sakshi

సాక్షి, అమరావతి/ సాక్షి, తిరుపతి: త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మూడు జిల్లాల్లో సమర శంఖారావం సభలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి సమీపంలోని యోగానంద ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్‌లో మొదటి సభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాలను ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో నిర్వహించాలని మొదట నిర్ణయించగా ప్రస్తుతం స్వల్ప మార్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు. తాజా మార్పు ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీన తిరుపతి (చిత్తూరు జిల్లా), 7వ తేదీన వైఎస్సార్‌ జిల్లాలో, 8వ తేదీన అనంతపురం జిల్లాలో సభలు జరుగుతాయన్నారు.

వీటి తర్వాత రెండో విడత సభల వివరాలు ప్రకటిస్తామన్నారు. ఇలా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిర్వహించనున్న ఈ సభల ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. సభ ప్రారంభానికి ముందే ఆయా జిల్లాల్లో కమిటీలు ఏవైనా పెండింగ్‌లో ఉంటే నియామకాలు పూర్తి చేయటంతో పాటు బూత్‌ కమిటీలు క్రియాశీలకంగా లేనిచోట్ల మార్పులు, చేర్పులు చేసుకుని అందరికీ సమాచారం అందించి సభకు హాజరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభకు హాజరయ్యే బూత్‌ కన్వీనర్లు, కమిటీ సభ్యుల రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. వారిని మాత్రమే ఈ సభకు అనుమతించనున్నట్లు వివరించారు.

సమర శంఖారావం సభకు స్థల పరిశీలన..
వచ్చేనెల 6న నిర్వహించనున్న సమర శంఖారావం సభ కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్‌కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామి, దేశాయ్‌తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్‌ తదితరులు శనివారం యోగానంద ఇంజనీరింగ్‌ కళాశాల గ్రౌండ్‌ను పరిశీలించారు. 

Advertisement
Advertisement