వస్తున్నాడదిగో... | Sakshi
Sakshi News home page

వస్తున్నాడదిగో...

Published Fri, Sep 21 2018 1:00 PM

YS Jagan Praja Sankalpa Yatra Near to Vizianagaram - Sakshi

జన హితుడై... జన శ్రామికుడై... జనమే తన కుటుంబంగా...వారే జీవితంగా భావించే జగనన్న జిల్లాకు రానున్న తరుణంఆసన్నమైంది. ఎప్పుడు ఆయన వస్తారా... ఎప్పుడు ఆయన్ను
 చూద్దామా... ఎప్పుడు ఆయనతో కలసి అడుగువేద్దామా... అని ఎదురు చూస్తున్న అశేష జనవాహిని కల నెరవేరే రోజు సమీపిస్తోంది. కేవలం నాలుగురోజుల్లోనే ఆయన యాత్ర జిల్లాకు చేరుకోనుంది. అంతేనా...ఓ చారిత్రాత్మక ఘట్టానికి జిల్లా వేదిక కానుంది. అదే ఆయన మూడువేలకిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకునే సంబరం. ఆ ఘట్టం చిరస్థాయిగా నిలిచిపోయేలా... నిర్మిస్తున్న పైలాన్‌ను జననేత ఆవిష్కరించనున్నారు.

సాక్షిప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ఇప్పటికి 10 జిల్లాల్లో పూర్తిచేసుకుని 11వ జిల్లా అయిన విశాఖపట్నంలో కొనసాగుతోంది. ఈ నెల 24 నాటికి ఆ జిల్లాలోనూ పూర్తి చేసుకుని విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని దేశపాత్రునిపాలెం గ్రామానికి చేరుతుంది. అక్కడికి చేరేనాటికి 3వేల కిలోమీటర్ల మైలురాయిని దాటుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రొగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం విశాఖలో గురువారంప్రకటించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నందున దానికి గుర్తుగా దేశపాత్రునిపాలెంలో ఒక స్థూపాన్ని నిర్మిస్తున్నారు. దానిని ఆ రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించనున్నారని ఆయన వెల్ల డించారు. ఇదే విషయాన్ని పార్టీ విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కొత్తవలసలో పైలాన్‌ ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం తెలిపారు. రాష్ట్రంలోని 115 నియోజకవర్గాల్లో సాగిన పాదయాత్ర 116వ నియోజకవర్గంగా మన జిల్లాలోని ఎస్‌ కోట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించనుంది.

జిల్లానేతల భారీ ఏర్పాట్లు
ఈ నెల 24వ తేదీన జగన్‌ ప్రజా సంకల్పయాత్ర జిల్లాలో అడుగుపెడుతుండటంతో పాదయాత్ర ఓ పండగలా నిర్వహించేందుకు పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో, మరో సీనియర్‌నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు సూచనలతో తొమ్మిది నియోజకవర్గాల సమన్వయకర్తలు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు పాదయాత్రను జిల్లాలో విజయవంతం చేయడానికి శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. జిల్లాలో అడుగుపెడుతున్న రోజు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ యంత్రాంగం తరలివెళ్లనుంది.

చారిత్రక ఘట్టానికి వేదిక
జిల్లాలోనే మూడువేల కిలోమీటర్ల మైలురాయిని దాటుతుండటంతో ఆ ఘట్టాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు ఇప్పటికే పైలాన్‌ నిర్మాణాన్ని ప్రారంభించి శరవేగంగా పనులు జరిపిస్తున్నారు. భారీ ద్వారాలు, కటౌట్లు, బ్యానర్ల ఏర్పాటుతో పాటు ప్రత్యేక కళా బృందాలను రప్పించి ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా స్వాగతం పలకడానికి జిల్లా ఎదురుచూస్తోంది.

Advertisement
Advertisement