విషాదం: సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి..

tragedy in ysr kadapa district - Sakshi

తల్లిదండ్రులకు ‘సెల్ఫీ’ కడుపుకోత

శోకసంద్రంలో రెండు కుటుంబాలు

ఒకరు మృతి.. మరొకరు గల్లంతు

రోజురోజుకు యువతి, యువకుల్లో సెల్ఫీ మోజు పెరిగిపోతోంది... అదే ఇప్పుడు తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తోంది... ఇలాంటి సంఘటన రాజంపేట మండలంలోని ఆర్‌ బుడుగుంటపల్లె సమీపంలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు వెనుక జలాల వద్ద చోటు చేసుకుంది... సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు... గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

రాజంపేట(వైఎస్సార్‌ కడప): రాజంపేట మండలంలోని ఆర్‌. బుడుగుంటపల్లె సమీపంలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు వెనుక జలాల్లో ప్రమాదవశాత్తూ పడిపోయి ఒకరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపేటలోని తుమ్మల అగ్రహారానికి చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు, అలాగే అటవీ గ్రామమైన ఆర్‌ బుడుగంటపల్లెలో జరుగుతున్న పీర్ల పండుగను చూద్దామని ప్రణాళిక వేసుకుని అన్నమయ్య ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌కు వద్దకు వెళ్లారు. ముర్రిపల్లె సునీల్‌కుమార్‌ ఆచారి, చల్లా ప్రకాశ్, దయాకర్, మౌలాతో మరొకరు కలిసి వెళ్లారు.

అక్కడ సునీల్, చల్లా ప్రకాశ్‌ అన్నమయ్య బ్యాక్‌ వాటర్‌ సమీప గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో గట్టు విరిగిపడింది. దాంతోపాటు వారు కూడా నీటి మడుగులో పడిపోయారు. అనంతరం మునిగిపోయారు. దీంతో తోటి స్నేహితులు భయంతో పరుగులు తీసి తమ వారికి సమాచారం ఇచ్చారు. వెనువెంటనే మన్నూరు ఎస్‌ఐ మహేశ్‌నాయుడు తమ సిబ్బందితో కలసి రంగప్రవేశం చేశారు. ప్రమాదవశాత్తు మునిగిపోయిన చల్లా గురు ప్రకాశ్‌(19) మృతదేహం లభ్యమైంది. సునీల్‌ ఆచారి మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

వంశోద్దారకుడిని కోల్పోయిన కుటుంబం
ఆ కుటుంబానికి చల్లా గురుప్రకాశ్‌ ఒక్కడే కుమారుడు. బీకాం చదువుతున్నాడు. మిత్రులతో సరదాగా గడుపుదామని పీర్ల పండుగ సందర్భంగా సెల్ఫీల కోసం అన్నమయ్య బ్యాక్‌వాటర్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రమాదవశాత్తు మడుగులో పడి దుర్మరణం చెందాడు. తండ్రి మనోహర్‌ నిమ్మకాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. మృతునికి ఒక అక్క, చెల్లి ఉంది. ఉన్న ఒక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. 

తమ్ముడి బాటలో అన్నకు జలగండం..
అన్నమయ్య బ్యాక్‌వాటర్‌లో గల్లంతు అయిన సునీల్‌కుమార్‌ ఆచారి(22) ఐటీఐ విద్యను పూర్తి చేశాడు. తండ్రి మర్రిపల్లె సుబ్బరాయుడు ఆచారి కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. ఈ కుటుంబంలో ముగ్గురు సంతానం ఉన్నారు. గల్లంతు అయిన సునీల్‌ తమ్ముడు రెండేళ్ల వయస్సులో నీటి టబ్‌లో పడి మృతి చెందాడు. నీటి ముప్పు ఈ కుటుంబాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో ఆర్‌ బడుగుంటపల్లెలో పీర్ల పండుగ బాగా జరుగుతుందని తెలుసుకొని శనివారం స్నేహితులతో కలసి అక్కడికి వెళ్లారు. ఆ ఊరిలో పీర్లను దర్శించుకున్నారు. అనంతరం అన్నమయ్య బ్యాక్‌ వాటర్‌ వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుండగా నీటిలో జారిపడి పోయాడు. తిరుపతి నుంచి సమీప బంధువును పుట్టిన రోజు సందర్భంగా పిలిపించి ఆర్‌ బడుగుంటపల్లెకు తీసుకుని వెళ్లారు. జరిగిన ప్రమాదంలో తన బిడ్డ ఉన్నాడా? చనిపోయాడా అనే సందిగ్ధంలో మర్రిపల్లె సుబ్బరాయుడు ఆచారి దంపతులు తల్లడిల్లుతున్నారు.

ఒకే వీధికి చెందిన వారు
తుమ్మల అగ్రహారం సమీపంలోని ఒకే వీధిలో ఉన్న ఐదుగురు స్నేహితులు సరదాగా వెళ్లి.. ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఈ వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా పాతబస్టాండులో జరిగే పటాసుల విన్యాసాలను చూసేందుకు వెళ్లాలని వీధిలోని యువకులు ఉన్న సమయంలో తమ వీధికి చెందిన ఇద్దరు యువకులు మృత కూపంలో ఇరుక్కున్నారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమ బిడ్డ ఇంకా బతికే ఉంటాడని, అతని రాక కోసం తల్లి ఎదురు చూస్తోంది.  

పోలీసుల ముమ్మర గాలింపు
అన్నమయ్య బ్యాక్‌వాటర్‌లో గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాజంపేట రూరల్‌ ఎస్‌ఐ మహేశ్‌నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గజ ఈతగాళ్లు తెప్పలపై మడుగులో గాలింపు చేశారు. అలాగే సునీల్‌కుమార్‌ ఆచారి తండ్రి, సంబంధీకులు, స్నేహితులు అన్నమయ్య బ్యాక్‌వాటర్‌ వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డ మృతదేహం కోసం తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. మొత్తం మీద తుమ్మల అగ్రహారం కన్నీటి సంద్రంగా మారింది. ఆ వీధికి చెందిన 60 మందికి పైగా యువకులు సంఘటన స్థలానికి తరలివెళ్లారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top