గొలుసు దొంగలతో.. ఖాకీల లాలూఛీ | Sakshi
Sakshi News home page

గొలుసు దొంగలతో.. ఖాకీల లాలూఛీ

Published Mon, Jan 11 2016 12:05 AM

Thief snatches chain

సాక్షి ప్రతినిధి, ఏలూరు : దొంగతనం చేసిన ప్రబుద్ధులు పోలీసులకు అడ్డంగా దొరికిన తర్వాత.. మా మీద కేసుల్లేకుండా చూడండి.. మీకెంత కావాలో తీసుకోండి.. అని బంపర్ ఆఫర్ ఇచ్చిన వైనం.. అందుకు ఖాకీలు తలొగ్గిన నిర్వాకం ఏజెన్సీలో కలకలం రేపుతోంది. రెండురోజుల క్రితం చోటు చేసుకున్న ఈ వ్యవహారం పూర్వాపరాలిలా ఉన్నాయి.
 
 జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో కుండలు, తినుబండారాలు విక్రయించుకునే ఓ మహిళ వద్దకు శుక్రవారం సాయంత్రం నాలుగుగంటల సమయంలో ఇద్దరు యువకులు వచ్చారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఆ ఇద్దరిలో ఒక యువకుడు మట్టి కుండ కావాలని బేరమాడాడు. ఆమె కిందకు ఒంగి మట్టి కుండలు చూపిస్తుండగా.. మెడలోని బంగారు నానుతాడును తెంపుకుని.. బండి స్టార్ట్ చేసి రెడీగా ఉన్న యువకుడితో కలిసి పరారయ్యాడు. ఆ మహిళ వేసిన కేకలతో పక్కనే ఉన్న ఆమె కుమారుడు, బంధువులు ఆ యువకులను వెంబడించాడు.
 
 ఆ యువకులు అప్పలరాజుగూడెం మీదుగా టి.నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెం వెళ్లి అక్కడ కోడిపందేలు జరుగుతుంటే ఆ జనంలో కలిసిపోయారు. అయినాసరే గుర్తుపట్టిన ఆమె కుమారుడు, బంధువులు వారిని పట్టుకున్నాడు. ఈలోగా మహిళ ఇచ్చిన సమాచారంతో జీలుగుమిల్లి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తొలుత వారిద్దరూ తమకేం సంబంధం లేదని బుకాయించినా.. ఆ మహిళను అక్కడకు తీసుకొచ్చి వారిని చూపించడంతో ఆమె గుర్తుపట్టి వీళ్లే తన గొలుసు తెంచుకెళ్లారని స్పష్టం చేసింది. ఇంతలో టి.నరసాపురం పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు.
 
 పెద్దల పంచాయితీ
 సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఆ యువకులకు మద్దతుగా ఊరి పెద్దలు రంగప్రవేశం చేశారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఆ గొలుసుతో పాటు రూ.40వేలు ఆ అమ్మాయికి ఇప్పిస్తాం.. మీరు ఓ రూ.లక్షన్నర పుచ్చుకోండి.. అని పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతే..మారుమాట్లాడకుండా పోలీసులు ఆ సొమ్మును పుచ్చుకుని కేసుల్లేకుండా తిరిగి వెళ్లిపోయారు. ఇక్కడ దొంగలు దొరికారు కాబట్టి ఆ మహిళకు న్యాయం జరిగింది.. కానీ దొరక్కపోతే పరిస్థితేమిటి.. దొరికిన దొంగలంతా.. ఇదే మాదిరి పంచాయితీలు చేయిస్తూ పోతే అసలు పోలీసుల వల్ల ఉపయోగమేమిటి అన్నవే ఈ వ్యవహారంతో ఉత్పన్నమైన ప్రశ్నలు.
 

Advertisement
Advertisement