జన హోరు.. సంకల్పానికి జేజేలు  | Sakshi
Sakshi News home page

జన హోరు.. సంకల్పానికి జేజేలు 

Published Thu, Jun 14 2018 2:56 AM

Huge Public On Arthur Cotton Barrage to the YS Jagan Prajasankalpa Yatra - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సంకల్ప యాత్ర ముందుకు సాగింది. బుధవారం 188వ రోజు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట అశేష ప్రజానీకం అడుగులో అడుగేసి సంఘీభావం తెలిపింది. ఊరూరా ప్రజలు ఘన స్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని మంగళవారం రాజమహేంద్రవరంలో అడుగుపెట్టిన జననేతకు అపూర్వ రీతిలో ప్రజలు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. జన ఉప్పెన ఎగిసి పడిందా.. అన్న రీతిలో ప్రజలు గోదావరి వంతెన ఆ చివర నుంచి ఈ చివర వరకు పోటెత్తడంపై ఊరూరా చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో రెండవ రోజు పాదయాత్రలో సైతం ప్రతి చోటా జనంలో అదే ఉత్సాహం, ఆనందం కనిపించింది. జగనన్న తమ వద్దకే పాదయాత్రగా వస్తున్నారని తెలుసుకున్న జనం గంటల తరబడి ఆసక్తిగా ఎదురు చూశారు. రాజమహేంద్రవరంలో రాత్రి బస చేసిన ఐఎల్‌టీడీ జంక్షన్‌ వద్ద గ్లోరిడై చర్చి ప్రాంతం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. అల్కాట్‌ తోట, రూరల్‌ ప్రాంతమైన శంభునగర్, లక్ష్మీనరసింహనగర్‌ మీదుగా సాగింది. అడుగడుగునా పెద్ద సంఖ్యలో మహిళలు జననేతతో మాట్లాడాలని వేచి ఉండటంతో యాత్ర ఆలస్యంగా సాగింది. ప్రతి సెంటర్‌లోనూ యువకులు ద్విచక్ర వాహనాలపై పార్టీ జెండాలు చేతబూని సందడి చేశారు. జై జగన్‌.. అని నినాదాలు చేస్తూ దారి పొడవునా హోరెత్తించారు.

మహిళలు, విద్యార్థినులు సెల్ఫీలు తీసుకోవడానికి, కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. దీంతో ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన భోజన బస వద్దకు రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. కాసేపటి తర్వాత అర్థర్‌ కాటన్‌ బ్యారేజిపై నుంచి నడక సాగిస్తున్నప్పుడు అశేష ప్రజానీకం జగన్‌ను అనుసరించింది. మరో వైపు బ్యారేజీపై కూడా జనం ఎదురొచ్చి తమ సమస్యలను జగన్‌కు చెప్పుకున్నారు. స్థానిక ప్రజలు బ్యారేజీకి ఇరువైపులా గెలలతో కూడిన అరటి చెట్లను అలంకరించి (ఈ ప్రాంతంలో అరటి సాగు ఎక్కువ) స్వాగతం పలకడం వారి అభిమానానికి నిదర్శనంగా నిలిచింది. కాటన్‌ బ్యారేజి మీద పిచ్చుక లంక దాటుకుంటూ బొబ్బర్లంక గ్రామంలోకి జగన్‌ ప్రవేశిస్తున్నపుడు భారీ ఎత్తున జనం ఎదురేగి ఆయనకు స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుమ్మడికాయలతో హారతి పట్టారు.  

కష్టాలు ఏకరువు పెట్టిన ప్రజలు
బొబ్బర్లంక గ్రామం కుడి వైపున గల పంట కాలువలో నవరత్నాల పథకాలను చిత్రీకరించిన కటౌట్‌లను పడవలపై ఆకర్షణీయంగా అలంకరించడం ఆకట్టుకుంది. బొబ్బర్లంక దాటి పేరవరంలో రాత్రి బసకు చేరుకునేంత వరకూ జనం ఓ వైపు స్వాగతం పలుకుతూనే మరో వైపు కష్టాలు చెప్పుకున్నారు. డ్రెయిన్‌ నిర్మాణానికి అడ్డంగా ఉన్నాయని కాలువ గట్టుపై ఉన్న ఇళ్లను తొలగిస్తామంటున్నారని, ఇలాగైతే 40 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమ పరిస్థితి ఏమిటని ధవళేశ్వరానికి చెందిన చిట్టూరు అనంతలక్ష్మి జననేత ఎదుట కన్నీటి పర్యంతమైంది. ‘కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఖర్చు చేసి డాబా కట్టుకున్నాం.

మాలాగే 250 మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మా అత్త, మామల ఊరు కూడా ఇదే. మేం ఎక్కడికి పోవాలి? డ్రెయిన్‌ నిర్మాణాన్ని మరో మార్గంలో చేపట్టేలా చూడండి’ అని ఆమె విన్నవించింది. వినికిడి, మూగ సమస్యతో బాధ పడుతున్న తన కుమారుడు శ్రీరాంగౌడ్‌కు సదరమ్‌ సర్టిఫికెట్‌ ఉన్నప్పటికీ పింఛన్‌ ఇవ్వడం లేదని ఇదే గ్రామానికి చెందిన మారిశెట్టి అనూరాధ తన గోడు వెళ్లబోసుకుంది. జన్మభూమి కమిటీ వారికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వాపోయింది. ‘నాలుగేళ్లుగా అన్నీ కష్టాలేనన్నా.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నా.. మోసపోయామన్నా.. ఇక మీ వెంటే నడుస్తామన్నా’ అని పలువురు జననేతతో అన్నారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.     

Advertisement
Advertisement