ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు

Published Fri, Jan 30 2015 6:34 PM

ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు - Sakshi

బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ఎ. విద్యాసాగర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం క్రిమినల్ కేసు నమోదైంది. విద్యాసాగర్ తనను కించపరుస్తున్నారంటూ రచయిత్రి, పబ్లిషర్ అయిన వత్సల కోర్టును ఆశ్రయించడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్‌నెం. 13లో నివసించే వత్సలకు తెలుగు సాహిత్యంపై ఉన్న పట్టు, రచయిత్రి కావడం, గేయ రచయిత కూడా కావడంతో విద్యాసాగర్ కూడా వీటిపట్ల ఆకర్షితుడై ఆమెతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య గత కొన్నేళ్ల నుంచి సన్నిహిత సంబంధం కూడా కొనసాగుతున్నది.

 

తామిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధంతో ఇద్దరూ కలిసి ప్రకాశం జిల్లా కణిగిరిలో 12 ఎకరాల వ్యవసాయ స్థలం కూడా తీసుకున్నారు. వీటి నిర్వహణ, అభివృద్ధి అంతా వత్సల చూస్తుండేది. అయితే కొంత మంది చెప్పుడు మాటలు, తన ఇంట్లో కుటుంబీకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో విద్యాసాగర్ ఆమెనుంచి దూరంకాసాగాడు. ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను దూరం చేసుకునేందుకు విద్యాసాగర్ పలు రకాలుగా ప్రయత్నిస్తున్నాడు.

 

ఇందులో భాగంగా ఆమె ప్రవర్తన మంచిదికాదంటూ ప్రచారం చేస్తూ తన కుల సంఘాలతో కలిసి ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించాడు. పలుమార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆమెపై దుష్ర్పచారం చేయడమే కాకుండా ఆమె ప్రవర్తనను కించపరుస్తూ అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు. దీంతో బాధిత రచయిత్రి కోర్టును ఆశ్రయించింది. మూడవ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు విద్యాసాగర్‌తోపాటు మరో ఆరు మందిపై ఐపీసీ సెక్షన్ 107, 153(ఏ), రెడ్‌విత్ 120 బి, 156(3) కింద కేసులు నమోదు చేశారు.

Advertisement
Advertisement