ఎల్లుండి శ్రీకాకుళంలో పర్యటించనున్న సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఎల్లుండి శ్రీకాకుళంలో పర్యటించనున్న సీఎం జగన్‌

Published Wed, Sep 4 2019 9:34 PM

CM YS Jagan Will Visit Srikakulam District On 6th September - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖారారైంది.  ఈ నెల 6వ తేదీన జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి.. విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా పలాసకు వెళ్తారు. ఉదయం 11 గంటలకు కాశీబుగ్గ చేరుకుని.. అక్కడి రైల్వే గ్రౌండ్స్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

ఉద్దానం ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేసే ప్రాజెక్టుకు, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించిన జెట్టీ నిర్మాణానికి, పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పైలట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీని  ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.

అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎచ్చెర్లకు చేరుకుంటారు. ఎస్‌ఎం పురం ట్రిపుల్‌ ఐటీలో తరగతి గదులను, హాస్టల్‌ బ్లాక్‌లను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభి​స్తారు. తర్వాత అక్కడి విద్యార్థులతో సీఎం వైఎస్‌ జగన్‌ ముచ్చటిస్తారు. అనంతరం జిల్లాలోని సింగుపురంలో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అనంతరం నేరుగా విశాఖ చేరుకుని.. అక్కడి నుంచి గన్నవరానికి తిరుగు పయనమవుతారు. 

Advertisement
Advertisement