రాజీవ్ విద్యాదీవెనపై దృష్టి : కలెక్టర్ | Sakshi
Sakshi News home page

రాజీవ్ విద్యాదీవెనపై దృష్టి : కలెక్టర్

Published Sat, Dec 28 2013 12:39 AM

రాజీవ్ విద్యాదీవెనపై దృష్టి : కలెక్టర్

మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యాదీవెన ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లను అందించేందుకు అర్హులైన విద్యార్థులను గుర్తించాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖాధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో రాజీవ్ విద్యాదీవెన, ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్ మందకొడిగా సాగుతోందన్నారు.

జాప్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నం, అవనిగడ్డ, గూడూరు మండలాల్లో తుది విడతగా అమలు చేస్తున్నామని, ఈ మండలాల్లో బృందం సభ్యులు పర్యటించి లోపాలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాలని చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖ ఏడీ మధుసూదనరావు, బీసీ సంక్షేమశాఖ ఏడీ ఎం.చినబాబు, రాజీవ్ విద్యామిషన్ పీవో డి.పద్మావతి, డీటీడబ్ల్యూవో కె.సత్యనారాయణ పాల్గొన్నారు.
 
బాలల సంరక్షణకు కృషి చేయాలి
 
విజయవాడ సిటీ : బాలల పరిరక్షణపై ప్రజల్లో పరివర్తన తీసుకురావటానికి కృషి చేయాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు సూచించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. చిన్నారుల హక్కుల అమలులో అధికారులు, స్వచ్ఛంద సంస్థల పాత్ర అత్యంత కీలకమన్నారు.

డివిజన్ స్థాయిలో ఆర్‌డీఓలు బాల్యవిహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్‌కలెక్టర్ డి.హరిచందన మాట్లాడుతూ బాలికలపై వివక్ష తొలగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య, ఐసీడీఎస్ ఆర్జేడీ కె.రాఘవరావు, జేడీ శ్యామసుందరి, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పీడీలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement