రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

Published Thu, Aug 28 2014 3:17 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు - Sakshi

 సాక్షి, ఏలూరు : రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో ప్రమాద బాధ్యులపై ఆయా శాఖలు కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే అవి తగ్గుముఖం పడతాయని కలెక్టర్ కాటమనేని భాస్కర్ అభిప్రాయపడ్డారు. ఏలూరు కలెక్టరు కార్యాలయంలో బుధవారం రాత్రి జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలను నివారించడంలో ప్రతిఒక్క శాఖ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిందేనని, అలాకాని పక్షంలో బాధ్యులను గుర్తించి వారిపైనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  పాడైన రహదారులను   మరమ్మతులు చేయడం, జాతీయ  రహదారులపై తనిఖీలు చేయాలన్నారు. జాతీయ రహదారిపై ఉన్న మద్యం షాపులను మరో ప్రాంతానికి మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లా రోడ్డు భద్రతా కమిటీ తీర్మానించింది. రాత్రి వేళల్లో నిఘా ముమ్మరం చేసి మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని పట్టుకుని కేసులు నమోదు చేయాలన్నారు.    మద్యం సేవించిన వారిని గుర్తించే శ్వాసకోశ పరీక్షా యంత్రాలను మరిన్ని కొనుగోలు చేసి ట్రాఫిక్ పోలీసులకు అందించాలని డీటీసీ శ్రీదేవిని కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు.
 
 భావితరాలకు అవగాహన కలిగించండి
 బాలబాలికల్లో రోడ్డు భద్రతపై అవగాహన కలిగించేందుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రవాణాశాఖ, విద్యాశాఖాధికారులు సమన్వయంతో ప్రతి మండలంలో బాలబాలికలకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగించాలన్నారు.  పాఠశాలల బస్సులను ప్రతి రోజూ డీఎస్పీల పరిధిలో రెండు బస్సులు తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
 

Advertisement
Advertisement