Sakshi News home page

సోషల్‌ మీడియాపై గట్టి నిఘా

Published Tue, Nov 14 2023 1:52 AM

మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌ పర్సన్‌ దీపిక 
 - Sakshi

సూర్యాపేట క్రైం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్‌ మీడియాపై గట్టి నిఘా ఉంచినట్లు ఎస్పీ రాహుల్‌హెగ్డే ఓ ప్రకటనలో తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్ల పేర్కొన్నారు. వాట్సాప్‌ గ్రూపుల్లో నాయకులు, పార్టీలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు, అనుచిత ఫొటోలు పెట్టినందుకు సంబంధిత బాధితుల ఫిర్యాదు మేరకు సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు, పోటీ చేస్తున్న అభ్యర్థులను కించపరిచేలా, ఇతరులను రెచ్చగొట్టెలా స్టేటస్‌లో ఫొటోలు పెట్టినందుకు బాధితుల ఫిర్యాదు మేరకు మునగాల పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేసినట్లు వివరించారు.

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

సూర్యాపేటటౌన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌ పర్సన్‌ గుజ్జా దీపిక సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో నియమావళికి లోబడి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ విద్యుత్‌కు సంబంధించి లూజ్‌ వైర్లు, ఒరిగిన, శిథిలావస్థలో ఉన్న స్తంభాలు గ్రామాల్లో ఉంటే సరి చేయాలన్నారు. పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాల్లో ప్రజలకు ఆరోగ్య సేవల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు సందర్శించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ సురేష్‌, జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

నేడు చిట్యాలలో కేటీఆర్‌ రోడ్‌ షో

చిట్యాల: చిట్యాలలో మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో కార్యక్రమంతోపాటు ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నకిరేకల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. చిట్యాలలో రోడ్‌ షో, సభను నిర్వహించనున్న ప్రాంతాలను సోమవారం ఆయన స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్‌ షో కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆయన వెంట నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రెగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ మెండె సైదులు ఉన్నారు.

నేటి నుంచి ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

మునగాల(కోదాడ): ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయిలో క్రీడాకారుల ఎంపిక పోటీలు మంగళవారం నుంచి ఈనెల 18వరకు నిర్వహించనున్నట్లు సూర్యాపేట జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎండి.ఆజంబాబా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ , కస్తూరిబా, మోడల్‌స్కూల్‌, సొషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్ల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. మంగళవారం 14,17 ఏళ్ల బాలబాలికలకు సూర్యాపేట జిల్లాస్థాయి క్రికెట్‌ కీడాకారుల ఎంపిక పోటీలు జిల్లా కేంద్రలో జరుగుతాయని, బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు నడిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 16న ఉమ్మడి నల్ల గొండ జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాల ఆవరణలో జరుగుతాయని, 18న ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయిలో 17సంవత్సరాల బాలబాలికలకు క్రికెట్‌ క్రీడాకారుల ఎంపికలను జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో గల క్రికెట్‌స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలు, ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు ఆయా తేదీల్లో ఉదయం 9గంటల కల్లా తనకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని సూచించారు.

విద్యకు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలి

నూతనకల్‌ : అధికారంలోకి వస్తే విద్యకు బడ్జెట్‌లో కేటాయించే నిధులపై ఆయా పార్టీలు స్పష్టత ఇవ్వాలని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రేపాక లింగయ్య కోరారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టే చర్యలను పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ప్రకటించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసే అంశాన్ని కూడా అందులో పేర్కొన్నాలన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement