Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌

Published Tue, Mar 26 2024 8:00 AM

- - Sakshi

ఆమనగల్లు: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు బంపర్‌ ఆఫర్‌ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 28న జరగనుంది. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం కో సం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తమ పార్టీల ప్రజాప్రతినిధులు చేజారకుండా వారి కి బంపర్‌ ఆఫర్‌ ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు పంపించారు. జిల్లా లో స్థానిక సంస్థల్లో పోటీచేసిన పలువురు పెద్ద మొత్తంలో ఖర్చుచేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు చేసినప్పటికీ సరిగా బిల్లులు రాక పలువురు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో తమకు ఆర్థికంగా కలిసివస్తుందని భావించినప్పటికీ అప్పట్లో కసి రెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 28న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించడంతో మళ్లీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కొంత ఉత్సాహం కనిపించింది. ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాట్లాడి క్యాంపులకు తరలించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో పాటు బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులను సైతం కలిసి ఆఫర్‌ ఇచ్చినట్టు సమాచారం. చాలామంది ఇరు పార్టీల అభ్యర్థులతో టచ్‌లో ఉండడం విశేషం. ఆమనగల్లుకు చెందిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే గోవా వెళ్లారు. క్యాంపులకు తరలివెళ్లిన ప్రజాప్రతినిధులు నేరుగా 28న జరిగే పోలింగ్‌కు రానున్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఈనెల 28న ఎన్నిక

ఎలాగైనా విజయం సాధించాలని అభ్యర్థుల వ్యూహాలు

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నం

ఆఫర్లతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు

Advertisement

What’s your opinion

Advertisement