Sakshi News home page

వలస కార్మికులపై నిఘా ఏదీ?

Published Mon, Mar 25 2024 1:10 AM

వలసకూలీలు (ఫైల్‌) - Sakshi

సిరిసిల్లక్రైం: జిల్లాలో వలసకార్మికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వలసకూలీల సమాచారం స్థానిక అధికారులు సేకరించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే నేరస్తుల వివరాలు లభించడం లేదు. ఇటీవల జిల్లాలో హత్యలు, ఆలయాల్లో దొంగతనాలు, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చొరబాట్లు పెరిగిపోయాయి. ఆయా సంఘటనల్లో చాలా వరకు నిందితులు దొరకడం లేదు. ఆయా కేసుల్లో నిందితులు స్థానికుల కాకపోవడం.. వలస కూలీలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వెంటనే వారి స్వస్థలాలకు వెళ్లిపోతుండడంతో నేరస్తులు దొరకడం లేదు.

అడ్డా కూలీలుగానే..

ఉపాధిహామీ పేరిట సొంతూరిని వదిలి ఇక్కడికి వస్తున్న కార్మికులు నిత్యం పని కోసం లేబర్‌ అడ్డా వద్ద ఎదురుచూస్తుంటారు. అడ్డా మీద దొరికిన పనికి వెళ్తుంటారు. ఇలా పనిచేస్తున్న వారి వివరాలు లేబర్‌శాఖ వద్ద లేవు. వారి వివరాల సేకరణకు కార్మికశాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా స్థానిక కూలీల గురించి అందరికి తెలిసినప్పటికీ.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి గురించి ఎవరికీ తెలియడం లేదు.

వ్యసనాలకు బానిసలుగా..

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల్లో అనేకమంది వ్యసనాలకు బానిసలుగా మారుతున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఉదయం లేవగానే తంబాకు, గుట్కా, గంజాయి, నాటుసారా, మద్యం సేవించి పనికి వస్తారని పేర్కొంటున్నారు. మత్తులోనే పనిచేస్తుంటారని, అదే మత్తులో గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నట్లు తెలిసింది. జిల్లాకు బిహార్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కార్మికులు వలస వస్తున్నారు. వీరి సమాచారం పోలీసులు, కార్మికశాఖ అధికారుల వద్ద లేదు.

తక్కువ కూలి.. ఎక్కువ పని

స్థానిక కూలీలను పనిలోకి తీసుకుంటే ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు వారు కూలి అడుగుతుండడంతో ఇతర ప్రాంతాల నుంచి ఇచ్చిన వలస కూలీలను తక్కువ డబ్బులకు పనిలోకి తెచ్చుకుంటున్నారు. రోజుకు రూ.500 వరకు ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. స్థానికులకు అయితే కనీసం రూ.800 ఇవ్వాల్సి రావడంతో వలసకూలీలతో పనులు చేయించుకునేందుకు భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, యజమానులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఇక్కడ వలస కూలీలకు పని దొరుకుతుండడంతో నిత్యం కొత్త వారు వచ్చి చేరుతున్నారు.

పని కోసం వచ్చి.. పక్కదారులు చట్టాలను అతిక్రమిస్తున్న వైనం సిరిసిల్లలో వివాహిత హత్య నిందితులు బీహర్‌ కార్మికులు

మూడు రోజుల క్రితం సిరిసిల్లలోని అనంతనగర్‌లో నివసిస్తున్న బిహార్‌ కూలీలు ఓ వివాహితను హత్యచేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దినసరి కూలీలు మద్యంమత్తులో హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పనిచేసిన క్రమంలో ఏర్పడిన వివాహేతర సంబంధం హత్యకు దారితీసినట్లు సమాచారం. అయితే కార్మికుల వివరాలు అధికారుల వద్ద ఉంటే పట్టుబడేవారని చర్చకు దారితీసింది.

వివరాల నమోదుకు ఆదేశాలు లేవు

జిల్లాలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికుల వివరాలు నమోదు చేయడానికి ప్రత్యేక ఆదేశాలు లేవు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈశ్రమ్‌ విధానంలో నమోదుకు అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా నమోదు చేయాలని లేదు. మన వాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్తే.. వారి వివరాలు సైతం నమోదు చేయరు. ప్రత్యేకంగా మన జిల్లాలో వలస కూలీల నమోదు ప్రక్రియ చేపడితే ప్రయోజనం ఉంటుంది. – రఫీ, లేబర్‌ ఆఫీసర్‌

Advertisement

What’s your opinion

Advertisement