Sakshi News home page

వడ్డీతో సహా చికిత్స ఖర్చులను చెల్లించండి

Published Thu, Mar 28 2024 1:35 AM

-

చిలకలపూడి(మచిలీపట్నం): ఖాతాదారుడికి వడ్డీతో సహా ట్రీట్‌మెంట్‌ ఖర్చులను చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు చింతలపూడి కిశోర్‌కుమార్‌, సభ్యులు నందిపాటి పద్మారెడ్డి, శ్రీలక్ష్మీ రాయల బుధవారం తీర్పు చెప్పారు. గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన పొట్లూరు బాపయ్యచౌదరి భార్య శ్రీదేవి పేర్లతో స్టార్‌ హెల్త్‌ అండ్‌ ఎలైడ్‌ ఇన్సురెన్స్‌ కంపెనీలో కరోనా కవచ్‌ పాలసీ తీసుకున్నారు. వీరిద్దరికీ కరోనా పాజిటివ్‌ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందగా చెరో రూ. 2 లక్షలు ఆస్పత్రికి చెల్లించారు. చికిత్సకు సంబంధించిన క్లయిమ్‌ను ఇన్సురెన్స్‌ కంపెనీ వారికి దరఖాస్తు చేసుకోగా వారు నిరాకరించారు. దీంతో వీరు ఇరువురు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పూర్వాపరాలను విచారించిన అనంతరం కమిషన్‌ సభ్యులు బాపయ్యచౌదరి, శ్రీదేవిలకు కలిపి రూ. 4 లక్షలు ట్రీట్‌మెంట్‌ ఖర్చులతో పాటు, క్యాష్‌ బెనిఫిట్‌గా రూ. 45 వేలు, క్లయిమ్‌ తిరస్కరించిన నాటి నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలన్నారు. దీంతో పాటుగా మానసిక వేదన కలిగించినందుకు రూ. 50 వేలు, ఖర్చుల నిమిత్తం రూ. 10 వేలు 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు.

హైవేపై కారు– కంటైనర్‌ ఢీ

చల్లపల్లి: జాతీయ రహదారి–216పై చల్లపల్లి వద్ధ బుధవారం రాత్రి కారు–కంటైనర్‌ ఢీకొన్నాయి. మోపిదేవి మండలం కప్తానుపాలెం నుంచి వేములపల్లి శ్రీహరి తన భార్యతో కలిసి చల్లపల్లి మీదుగా రామానగరం కారులో వెళుతుండగా, మచిలీపట్నం వైపు నుంచి వచ్చిన కంటైనర్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీహరి కాలు విరిగిపోగా, ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కంటైనర్‌ పల్టీలు కొట్టుకుంటూ ముందుకు దూసుకుపోయింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవగా, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

What’s your opinion

Advertisement