Sakshi News home page

సమగ్ర కులగణన సర్వేకు సమాయత్తం

Published Sat, Nov 18 2023 1:40 AM

- - Sakshi

అధికారులతో కలెక్టర్‌ కృతికా శుక్లా

కాకినాడ సిటీ: జిల్లాలో చేపట్టనున్న సమగ్ర కులగణన సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం కావాలని కలెక్టర్‌ కృతికా శుక్లా కోరారు. కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఆమె మున్సిపల్‌ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు గ్రామస్థాయిలో సచివాలయం, వలంటీర్‌ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఇంటింటా సర్వే నిర్వహించాలన్నారు. వివరాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించిందన్నారు. దీని వినియోగంపై సిబ్బందికి త్వరలోనే శిక్షణ ఇస్తామన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టా పొందిన లబ్ధిదారులతో నూరుశాతం గ్రౌండింగ్‌ పూర్తి చేయాలన్నారు.

20 నుంచి ఆడుదాం ఆంధ్రా రిజిస్ట్రేషన్‌

ఆడుదాం ఆంధ్రా కింద గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు జరుగు తాయని కలెక్టర్‌ చెప్పారు. ఈనెల 20 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు కిట్ల పంపిణీ, క్రీడా మైదానాలు, క్రీడా శిక్షకుల ఎంపిక వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన భవనాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జగనన్న పాల వెల్లువ కింద మహిళా పాడి రైతులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు మండల స్థాయిలో రుణమేళాలు నిర్వహించి బ్యాంకు రుణాలు మంజూరు ప్రక్రియ చేపట్టాలని కృతికా శుక్లా ఆదేశించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన నూతన మార్పులకు అనుగుణంగా తల్లి, విద్యార్థికి కలిపి ఒకే బ్యాంకు ఖాతాకు ఉండాలన్నారు. సమావేశంలో సీపీవో పి.త్రినాఽథ్‌, హౌసింగ్‌ పీడీ సుధాకర్‌ పట్నాయక్‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, జేడీ సోషల్‌ వెల్ఫేర్‌ డీఈ రమణమూర్తి, సెట్రాజ్‌ సీఈవో బి.శ్రీనివాసకుమార్‌, ఎల్డీం సీహెచ్‌ఎస్వీ ప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈలు ఎం.శ్రీనివాసు, బి.సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement