వైభవంగా శ్రీవారికి తిరుమంజనం | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారికి తిరుమంజనం

Published Tue, Nov 7 2023 11:52 PM

తిరుమంజనం నిర్వహిస్తున్న అర్చకులు - Sakshi

మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుస్థానార్చనలతో ప్రారంభమైన పవిత్రోత్సవాల్లో అగ్ని ప్రతిష్ఠాపన, పవిత్రారోహణ తదితర కార్యక్రమాలను జరిపించారు. బాలబాలాజీ స్వామితో పాటు పద్మావతి దేవి, ఆండాళ్‌తాయార్‌ అమ్మవార్లకు 27 కలశాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం ఆద్యంతం కనుల పండువలా జరిపించారు. వేద మంత్రాలు, భక్తుల కోలాహలం నడుమ ఈ కార్యక్రమం కమనీయంగా జరిగింది. వీటితో పాటు ప్రాయశ్చిత హోమం, నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి, చతుస్థానార్చనలు, నివేదన, మంగళా శాసనం పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి.మాధవి, ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ పర్యవేక్షణలో ముఖ్య అర్చక మద్దాలి తిరుమలశింగరాచార్యులు, ప్రధాన అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టాల సత్తిబాబు, కొమ్ముల సూరిబాబు, గూటం శ్రీను, బత్తుల విజయ గంగారత్నం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

సర్వేకు సహకరించాలి

అమలాపురం రూరల్‌ : అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం సర్వే కోసం భూ యాజమానులు సహకరించాలని జేసీ నపూర్‌ అజయ్‌ ఒక ప్రకటనలో కోరారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోగల గ్రామ కంఠంలో ప్రభుత్వానికి సంబంధించిన వాటి ఆస్తులు, వ్యక్తి గత ఇళ్లు, ఖాళీ స్థలముల కొలతల నిమిత్తం గ్రామ పంచాయతీతో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ నోటీసులు జారీచేసిన సమయంలో సంబంధిత యజమానులు అందుబాటులో ఉండి వారికి సహకారం అందించాలన్నారు.

Advertisement
Advertisement