Sakshi News home page

వనధన్‌ వెలుగులు

Published Sat, Nov 11 2023 1:00 AM

- - Sakshi

రంపచోడవరం: గిరిజనుల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన వన్‌ధన్‌ వికాస కేంద్రం (వీడీవీకే)ను మారేడుమిల్లి మండలం దేవరపల్లి, సున్నంపాడు గిరిజనులు సద్వినియోగం చేసుకుంటున్నారు. 2021లో దేవరపల్లి వన్‌ధన్‌ వికాస కేంద్రం (వీడీవీకే) పేరిట ఏర్పాటైన ఈ గ్రూప్‌లో దేవరపల్లి, సున్నంపాడు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కొంతమంది మహిళలు ఈ ఏడాది వెదురు బొంగులతో కొవ్వొత్తుల తయారీపై దృష్టి సారించారు. స్థానికంగా ఉన్న వనరులతో వీటిని తయారు చేసి ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు.

డిమాండ్‌ను బట్టి..

దీపావళి సీజన్‌ కావడంతో మార్కెట్లో కొవ్వొత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. స్థానికంగా అందుబాటులో ఉండే వెదురు బొంగులకు కొవ్వొత్తులను జోడించి వినియోగదారులను ఆకట్టుకునేలా కళాత్మకంగా వీటిని తయారు చేస్తున్నారు. ఇందుకుగాను రైతు పట్టా భూమిలోని వెదురును సేకరించి వినియోగిస్తున్నారు. బొంగులను కావాల్సిన సైజుల్లో కట్‌ చేసి వాటిలో రంగు రంగుల మైనాన్ని నింపి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. వెదురు బొంగుల్లో ప్రమిదలను అమర్చి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు వెయ్యి వరకు విక్రయించాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు చోట్ల స్టాళ్లు..

● రంపచోడవరంలో గిరిజన సహకార సంస్థ కార్యాలయం, ఐ. పోలవరం జంక్షన్‌, రాజమహేంద్రవరంలో స్టాళ్లను ఏర్పాటుచేశారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌గనోరే వీరికి అవసరమైన సహకారం అందిస్తున్నారు. దీపావళి సీజన్‌లో వీటికి మంచి డిమాండ్‌ ఉన్నందున ఎక్కువ సంఖ్యలో తయారు చేసేందుకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందిస్తామని వారికి తెలిపారు.

అమ్మకానికి సిద్ధం చేసిన వెదురు బొంగులతో కొవ్వొత్తులు

వెదురుబొంగులతో కొవ్వొత్తులు

వినియోగదారులను ఆకట్టుకునేలా తయారీ

గిరి మహిళల వినూత్న ప్రయత్నం

ఆకర్షణీయంగా కొవ్వొత్తులను తయారు చేసేందుకు వెదురు బొంగులను సిద్ధం చేస్తున్న గిరి మహిళలు

మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తున్న

వెదురు బొంగు కొవ్వొత్తులు

భారీ అమ్మకాలకు అవకాశం

దీపావళి పండగ నేపథ్యంలో శని, ఆదివారాలు సెలవు కావడంతో అమ్మకాలు పెద్ద సంఖ్య లో జరిగే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఎక్కువ సంఖ్య వెదురు బొంగు కొవ్వొత్తులను కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాం. ఒకొక్కటి సైజును బట్టి రూ.30 నుంచి రూ.40కు విక్రయిస్తున్నాం. ఐటీడీఏ పీవో కూడా సహకారం అందిస్తా మని చెప్పడం ఆత్మస్థైర్యాన్ని నింపింది. – బట్ట సుబ్బలక్ష్మి,

దేవరపల్లి వీడీవీకె లీడర్‌, సున్నంపాడు

డిమాండ్‌ను బట్టి తయారీ

దీపావళి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వెదురు బొంగులతో కొవ్వొత్తుల తయారీని ప్రోత్సహించాం. పండగ రోజునే కాకుండా పుట్టినరోజు వేడుకల్లోను వీటిని ఉపయోగించవచ్చు. ఈ ఏడాది తొలిసారిగా తక్కువ పెట్టుబడితో తయారు చేశారు. అమ్మకాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ఎక్కువ సంఖ్యలో తయారీకి చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసరావు,

వెలుగు ఏపీడీ, రంపచోడవరం

Advertisement

What’s your opinion

Advertisement