అందరి మందిరమయా!
విహంగం
డేనియెల్ మగేలాంగ్ దగ్గరలోని తన అత్తగారి ఊరికి వెళ్లినప్పుడు అక్కడ ఒక చోట ఒక ప్రదేశాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అది తనకు కలలో కనిపించిన ప్రదేశం! ఆ పచ్చని చెట్లు, కొండలు... సేమ్ టు సేమ్!
పర్యాటక ప్రాముఖ్యతలో అందాలు, విశేషాలు మాత్రమే కాదు... నమ్మకాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఏటేటా చికెన్ చర్చికి వస్తున్న వందలాది మంది పర్యాటకులను చూస్తే అర్థమవుతుంది. ఇండోనేషియాలోని మగేలాంగ్ అడవిలో ఉన్న ఈ చర్చికి క్రైస్తవులు మాత్రమే కాదు... బౌద్ధులు, ముస్లిములు ఇతర మతస్తులంతా కూడా వస్తారు. ఎక్కడా స్థలం లేనట్లు ఈ చర్చిని అటవీ ప్రాంతంలో, కొండ మీద ఎందుకు నిర్మించారు? ఎవరు నిర్మించారు?
అరవై ఏడు సంవత్సరాల డేనియల్ ఆల్మ్సజను గురించి తెలుసుకుంటే పై ప్రశ్నలకు సమాధానం తెలిసిపోతుంది. జకార్తాలో ఉద్యోగం చేస్తున్న డేనియల్‌కు ఒకరోజు కలలో దైవసందేశం లాంటిదేదో వినిపించిందట. ‘ప్రార్థనా మందిరం’ నిర్మించమనేది దాని సారాంశం. మరుసటి రోజు మరో కలలో... అడవిలో, కొండల మీద కోడి ఆకారంలో ఉన్న చర్చి కనిపిం చిందట. ఈ కల అతణ్ని పదేపదే వెంటా డడం ప్రారంభించింది. రాత్రికి రాత్రి మందిరాన్ని నిర్మించడానికి తానేమీ సంపన్నుడు కాదు. కానీ ఎలాగైనా సరే నిర్మాణాన్ని చేపట్టాలని దృఢంగా అనుకున్నాడు.
1989లో మగేలాంగ్ దగ్గరలోని తన అత్తగారి ఊరికి వెళ్లినప్పుడు అక్కడ ఒక చోట ఒక ప్రదేశాన్ని చూసి సంభ్రమాశ్చ ర్యాలకు లోనయ్యాడు. అది తనకు కలలో కనిపించిన ప్రదేశం! ఆ పచ్చని చెట్లు, కొండలు... సేమ్ టు సేమ్! కెంబాంగ్, కరంగ్‌జెరో గ్రామాల మధ్య ఉన్న రహ్మె కొండ ప్రాంతం అది. ఆ రాత్రంతా రహ్మె కొండ మీద ప్రార్థన చేశాడు డేనియల్. ప్రార్థనా మందిరం నిర్మించాల్సిన ప్రదేశం అదేనని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆర్థిక సమస్యలు ఎదురైనా ఆగకుండా నాలుగు సంవత్సరాల్లో రహ్మె కొండ మీద కోడి ఆకారంలో ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. మెల్లగా ఈ ప్రేయర్ హౌస్ గురించి ఇండోనేషియా మొత్తం తెలిసింది.
చాలినంత డబ్బు లేకపోవడం వలన నిర్మాణం అరకొరగా ఉందనిపించినప్ప టికీ, సౌకర్యాలకు దూరంగా అడవిలో ఒక మూల ఏకాంతంగా ఉందనిపించినప్ప టికీ సందర్శకులకు వచ్చిన లోటేమీ లేదు. ‘కోడి ఆకారంలో చర్చి’ అనే విశేషంతోనే పర్యాటకులు క్యూ కట్టారు. ఆ తరువాత ఈ మందిరంలో దివ్యశక్తి ఉందనే ప్రచారం మొదలైంది. మాదకద్రవ్యాలు, మందుకు బానిసైనవాళ్లు, మతిస్థిమితం లేనివాళ్లు ఈ మందిరంలో కొన్ని రోజులు బస చేస్తే... మంచి జరుగుతుందనే నమ్మకం ప్రబలింది. ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు రావడం మొదలైంది.
‘‘ఇక్కడ బస చేస్తే మంచి జరుగు తుంది అనేది కేవలం ప్రచారం కాదు నిజం’’ అంటున్నాడు డేనియల్. నమ్మక, అపనమ్మకాల విషయం ఎలా ఉన్నా ఈ కోడి రూపు చర్చి వల్ల... చుట్టుపక్కల గ్రామాలకు పర్యాటకపరంగా ఆదాయం పెరిగింది. కేవలం ఆధ్యాత్మిక నమ్మకాల కోణంలోనే కాదు... ‘సెల్ఫ్ డిస్కవరీ సెంటర్’గా కూడా ఈ మందిరాన్ని చూస్తున్నారు.
‘‘నమ్మకాలు మాత్రమే కాదు. ప్రశాంతత, ప్రకృతి సౌందర్యం కూడా ఈ చర్చికి ప్రాధాన్యతను పెంచుతున్నాయి’’ అంటున్నారు ఇక్కడికి వచ్చిన అమెరికన్ టీచర్ జెస్సికా పెంగ్.
అయితే తాను నిర్చించింది చర్చి కాదు అని కచ్చితంగా చెప్తున్నాడు డేనియెల్. అందరూ ప్రార్థించుకునే మందిరాన్ని నేను నిర్మించాను, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు అంటూ నొక్కి వక్కాణిస్తున్నాడు. అతడు అన్నట్టే అన్ని మతాల వారూ వస్తున్నా, ఆ మందిరాన్ని మాత్రం ‘చికెన్ చర్చ్’ ‘బర్డ్ చర్చ్’ ‘చర్చ్ డోవ్’ అనే పిలుస్తున్నారు.
‘‘ఈ ప్రార్థనా మందిరం వెనుక శతాబ్దాల చరిత్ర లేకపోయినప్పటికీ, ఆకట్టుకునే ఖరీదైన నిర్మాణాలేవీ లేకపోయినప్పటికీ...ఇక్కడికి రావడానికి పర్యాటకులు అధిక ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ పెళ్లిలాంటి శుభకార్యాలు కూడా జరుగుతున్నాయి’’ అంటున్నారు పట్రి నర్మాలిట అనే ట్రావెలర్. తాను తీసిన ఫోటోలతో ఈ చికెన్ చర్చ్‌కు ఆన్లైన్లో ఎంతో ప్రచారాన్ని కలిపించారు పట్రి. నమ్మకం అనేది ఎంతో బలమైనది. అది ఎక్కడెక్కడివాళ్లనో ఒక్కచోటకు రప్పిస్తుంది.