జయలలిత డెత్‌ మిస్టరీలో మరో ట్విస్ట్‌

జయలలిత డెత్‌ మిస్టరీలో మరో ట్విస్ట్‌


చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం కొనసాగుతుండగా శశికళ మేనల్లుడు జయానంద్‌ దివాకరన్‌ మరో బాంబు పేల్చారు. జయలలిత చివరి రోజులకు సంబంధించిన వివరాలు బయటపెడతానని ప్రకటించారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత, శశికళకు జరిగిన సంభాషణ వివరాలు, ఫొటోలు వెల్లడిచేస్తానని హెచ్చరించారు. జయలలితను శశికళ కుటుంబం పొట్టన పెట్టుకుందని పన్నీర్‌ సెల్వం వర్గం ఆరోపించడం పట్ల దివాకరన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నిజం నిప్పులాంటని, అది ఏనాటికైనా బయటకు వస్తుందని తన ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.‘ఆస్పత్రిలో ఉండగా జయలలిత ఫొటోలు శశికళ ఎందుకు బయటపెట్టలేదని అడుగుతున్నారు. పచ్చ రంగు గౌన్‌ లో ఆస్పత్రిలో దీనంగా ఉన్న అమ్మను ఆమెను ప్రత్యర్థులకు చూపించడం ఇష్టంలేకే శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారు. చనిపోయే వరకు ‘అమ్మ’ సింహంలా బతికింది. ఈ ఇమేజ్‌ కాపాడేందుకు ప్రయత్నించాం. కానీ పన్నీర్‌ సెల్వం అమ్మ శవపేటిక నమూనాతో ఓట్లు అడుక్కున్నారు. నిజం చాలా బలమైంది. అమ్మ, చిన్నమ్మ మాట్లాడుకున్న వీడియోలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. పీహెచ్‌ పాండియన్‌, మనోజ్‌ కె పాండియన్‌ లను అప్పుడు మనం ఏం చేయాల’ని దివాకరన్‌ ప్రశ్నించారు.తన వర్గాన్ని అన్నాడీఎంకేలో విలీనం చేసేందుకు పార్టీ నుంచి శశికళ కుటుంబ సభ్యులను బహిష్కరించాలని పన్నీర్ సెల్వం షరతు పెట్టిన నేపథ్యంలో సంక్షోభం మరింత ముదిరింది. జయలలిత మృతిపై విచారణ జరిపించాలని ఆయన మరో షరతు విధించారు.

Back to Top