టెన్త్‌ చదవకున్నా గెజిటెడ్‌ పోస్టు..! | Sakshi
Sakshi News home page

టెన్త్‌ చదవకున్నా గెజిటెడ్‌ పోస్టు..!

Published Tue, Aug 20 2019 8:34 AM

Ineligible Candidates Recruited In Telangana Endowment Department - Sakshi

దేవాదాయ శాఖలో వివాదాస్పద అధికారిగా పేరున్న ఓ వ్యక్తి అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో పలు కీలక ఆలయాల్లో పనిచేశారు. ఆయన విద్యార్హత ఆరో తరగతి. ఓసారి వయసు నిర్ధారణ కోసం పదో తరగతి మెమో కోరితే, నకిలీ పత్రం సృష్టించి సమరి్పంచారన్న ఫిర్యాదులొచ్చాయి. దీంతో ప్రస్తుతం దానిపై విచారణ సాగుతోంది. అంటే ఆరో తరగతి విద్యార్హతతో ఆయన ఏకంగా గెజిటెడ్‌ హోదా ర్యాంక్‌ ఉద్యోగం పొందేశారు. దేవాలయాల్లో చిరుద్యోగంలో చేరి ఆ తర్వాత సహాయ కమిషనర్‌ స్థాయికి వెళ్లినవారి సంఖ్య దాదాపు 60 వరకు ఉంటుందని సమాచారం. ఇందులో ఐదారుగురు డిప్యూటీ కమిషనర్లుగా కూడా పనిచేశారు.  

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పాస్‌ కాకున్నా గెజిటెడ్‌ హోదా అధికారి కావొచ్చు. నకిలీ ధ్రువపత్రాలతోనా అని అనుకుంటున్నారా?. అదేంకాదు.. అసలు ధ్రువపత్రాలేమీ లేకుండానే ఇది సాధ్యం. అదెలా అంటే.. రాష్ట్ర దేవాదాయ శాఖలో ఉద్యోగం పొందితే చాలు. అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాగా మారిన ఈ శాఖలో విద్యార్హతతో ప్రమేయం లేకుండా గెజిటెడ్‌ హోదా అధికారి కుర్చీ ఎక్కేయొచ్చు. బూజుపట్టిన విధానాలు మార్చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నా, దేవాదాయ శాఖలో మాత్రం ఈ అడ్డగోలు వ్యవహారం అలాగే కొనసాగుతోంది. 

ఇదీ జరుగుతోంది... 
దేవాలయ పాలకమండలి సభ్యులు, కొందరు అధికారుల ‘చలవ’తో విద్యార్హతల ఊసే లేకుండా జూనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో ఉద్యోగంలో చేర వచ్చు. తర్వాత నేరుగా దేవాలయ కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి పొందే వీలుంది. గ్రేడ్‌–3 ఈవోల పదోన్నతుల్లో 40%, గ్రేడ్‌– 2, –1 ఈవోల పదోన్నతుల్లో 20% చొప్పున వీరికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సీనియారిటీ ఆధారం గా కార్యనిర్వహణాధికారులు సహాయ కమిషనర్లుగా పదోన్నతి పొందే వీలుంది. విద్యార్హతతో సం బంధం లేకుండా గ్రేడ్‌–1 ఈవో అయిన వ్యక్తి సహా య కమిషనర్‌ అవుతాడు. పదవీ విరమణ సమ యం ఇంకా ఉంటే డిప్యూటీ కమిషనర్‌ కూడా అవు తారు. అలా అయిన వారు కూడా ఉన్నారు.  

దేవాదాయ శాఖకు మినహాయింపు.... 
కార్యనిర్వహణాధికారులు, సహాయ కమిషనర్లని నేరుగా టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే వెసులుబాటు ఉంది. కానీ, దేవాలయ ఉద్యోగులకు ఆ కీలక పోస్టుల్లో కూడా పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం కొన్ని పోస్టులను కేటాయించింది. అంటే కొన్ని నేరుగా, మరికొన్ని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారన్నమాట. దీంతోనే అసలు సమస్య వస్తోంది. ఈ శాఖలో చిరుద్యోగంలో చేరేటప్పుడు టీఎస్‌పీఎస్సీ నిబంధనలేవీ వర్తించవు. విద్యార్హతతో సంబంధం లేకుండా చేరిపోతున్నారు. తర్వాత గెజిటెడ్‌ పోస్టుల్లోకి పదోన్నతి పొందుతున్నారు. ఇలా కాకుండా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, ఆ పై గెజిటెడ్‌ హోదా పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారానే నియమించాలనే సూచన చాలాకాలంగా పెండింగులో ఉంది. 

వసూళ్లు లక్షల్లోనే.. 
దేవాదాయశాఖలోని కొందరు ఉన్నతాధికారులు యథేచ్ఛగా వసూళ్ల పర్వం కానిస్తున్నారు. పదోన్నతులు, నియామకాల్లో రూ.లక్షలు వసూలు చేయటం వారికి అలవాటుగా మారింది. తాజాగా ఓ అధికారి ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పై అధికారులకు వాటా ఇవ్వాలని చెప్పి మరీ వసూళ్లు చేశారని ఫిర్యాదులొచ్చాయి. ఇలాంటివారంతా నిబంధనలు మార్చకుండా అడ్డుపడుతున్నారు.    

Advertisement
Advertisement