సాగు సాగేదెలా..?  | Sakshi
Sakshi News home page

సాగు సాగేదెలా..? 

Published Thu, Jun 20 2019 11:52 AM

Farmers Waiting For Rains Medak - Sakshi

మెదక్‌జోన్‌: కాలం కలిసిరాక సాధారణం కన్నా వర్షపాతం తక్కువ నమోదైతే ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వరుస కరువు కాటకాలతో అప్పుల పాలవుతున్న రైతులు వర్షాలకోసం ఎదురుచూస్తూ దీర్ఘకాలిక పంటలైన వరి పంటలకు బదులు తేలికపాటి పంటలైన ఆరుతడి పంటలను సాగుచేస్తే అడపాదడప వర్షాలు కురిసినా, పంటలు పండుతాయనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికే అంచనాలను వేశారు. మరో వారం రోజులపాటు వర్షం కురవకుంటే అధికారులు తయారు చేసిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిందేనని ఓ జిల్లాస్థాయి అధికారి తెలిపారు. గతేడాది ఇప్పటికే జూన్‌ 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. వర్షాకాల ప్రారంభంలోనే గత సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఈ యేడు నేటికి చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. దీంతో కనీసం దుక్కులు సైతం ఎక్కడ కూడా దున్నలేక పోయారు. ఇప్పటికే 20 రోజుల పుణ్యకాలం గడిచిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
 
సాగు అంచనా 80 వేలహెక్టార్లు..
ఈ యేడు వర్షాలు సమృద్ధిగా కురిస్తే జిల్లా వ్యాప్తంగా 80 వేల హెక్టార్లమేర సాధారణ పంటలు సాగవుతోందని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేసి అందుకు అనుగుణంగా ఎరువులు, సబ్సిడీ విత్తనాలను సైతం సిద్ధంగా ఉంచారు. అందులో 36 వేల హెక్టార్లలో వరి పంటలు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటలు, 15 వేల హెక్టార్లలో పత్తితో పాటు 9 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు పంటలతో పాటు ఇతర పంటలు సాగు చేయటం జరుగుతుందని అంచనాలు వేశారు. నేటికి వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ప్రత్యామ్నాయ పంటలు..
జులై 31వ తేదీ వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే మొక్కజొన్న పంటకు బదులు 4200 హెక్టార్లలో కంది(పీఆర్‌జీ 176) తేలికపాటి రకం పంటను సాగేచేసే విధంగా అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి విత్తనాలు తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ వద్ద సిద్ధంగా ఉన్నాయి. అలాగే వరిపంటకు బదులు 14,985 హెక్టార్లలో సోయాబీన్‌ పంటను సాగుచేసేందుకు అందుకు సంబంధించిన సోయాబిన్‌ విత్తనాలు సిద్ధంగా ఉంచారు. అలాగే పత్తి పంటకు బదులుగా 6085 హెక్టార్లలో నల్లరేగడి భూముల్లో వేసేందుకు కంది విత్తనాలు సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, సాములు, కొర్రలు, విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదయితే తేలికపాటి పంటలు 39000 హెక్టార్లలో పంటలును సాగుచేయాలని అందుకు సంబంధించిన విత్తనాలు సిద్ధంగా ఉంచారు. 

 ప్రత్యామ్నాయానికి సిద్ధం..
మరో 20 రోజుల్లో సరిపడా వర్షాలు కురవకుంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు కోసం రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు ముందస్తుగానే కార్యచరణ పూర్తిచేశాం. ఇందుకు సంబంధించిన విత్తనాలను సైతం సిద్ధంగా ఉంచాం. వర్షాలు పుష్కలంగా (సరిపడ) కురిస్తేనే ముందస్తు అంచనాల మేరకు జిల్లాలో 80 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. లేనిచో అడపాదడప వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటల మేరకు తేలికపాటి పంటలైన 39,000 వేల హెక్టార్లలోనే పంటలను సాగు చేయాల్సి వస్తోంది. ఈ విషయంపై రైతులు తొందర పాటుతనంతో విత్తనాలు వేయొద్దు – పరశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

Advertisement
Advertisement