ఏ ఒక్క హామీ అమలుచేయని చంద్రబాబు | Sakshi
Sakshi News home page

ఏ ఒక్క హామీ అమలుచేయని చంద్రబాబు

Published Tue, Mar 20 2018 7:08 AM

Lavu Srikrishna Devarayalu Fires On Cm Chandrababu - Sakshi

వట్టిచెరుకూరు (పత్తిపాడు): గత ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. పెదనందిపాడులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ఆయనకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో, గుంటూరు నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని స్పష్టంచేశారు.

కాకుమాను మండలంలోని చెరువులో లోతుగా మట్టి తవ్వడంతో నీరు తాగటానికి పనికిరాకుండా పోయిందని, గ్రామ ప్రజల దాహార్తి తీర్చడంలో జెడ్పీ చైర్మన్, ఎంపీపీ విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికల సమయంలో సూట్‌ కేసులతో డబ్బులు తీసుకొచ్చి మ«భ్యపెట్టి గెలవాలని ప్రయత్నించే నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. తమలో ప్రవహిస్తున్నది ఎరుపు రక్తం కాదని, పచ్చరక్తమని జన్మభూమి కమిటీ సభ్యులను నమ్మిస్తేగానీ ప్రజలను ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయడం లేదని, ఇంతకంటే దౌర్భాగ్యపు పాలన ఎక్కడ ఉంటుందని విమర్శించారు. సాగునీటి కాలువల ఆధునికీకరణను గాలికొదిలేసి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.

Advertisement
Advertisement