ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్‌

Published Wed, Aug 7 2019 8:05 PM

CM YS Jagan Mohan Reddy Delhi Tour Second Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ ఉదయం ఉపరాష్ట్రపతితో భేటీ అయిన తర్వాత ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తర్వాత కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరితో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక ప్రతిపాదనలను ఆయనకు వివరించారు. జాతీయ రహదారులుగా గుర్తించాలంటూ కొన్ని రాష్ట్ర రహదారుల వివరాలు ఆయనకు నివేదించారు. రహదారుల నిర్వహణ, నిర్మాణం కోసం గ్రాంటులు పెంచాలంటూ విజ్ఞప్తి చేశారు. అమరావతి అనంతపురం ఎక్స్‌ ప్రెస్‌ హైవే నిర్మాణానికయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని కోరారు. తీవ్ర ఆర్ధిక కష్టాలతో ఉన్న రాష్ట్రానికి కేంద్ర సహాయం ఎంతో అవసరమని ఆ మేరకు సాయం చేయాలన్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు దీనికి సంబంధించి నిధుల విడుదల అంశాన్ని కూడా సీఎం జగన్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్‌తో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి నవరత్నాల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, దీని కోసం తగిన రీతిలో సహాయం చేయాలని కోరారు. రెవెన్యూ లోటును భర్తీ చేయడంతోపాటు పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాల్సి ఉందని, దీనికోసం ఇప్పటివరకూ ఇవ్వాల్సిన మొత్తంతోపాటు, ఆతర్వాత కూడా సకాలంలో నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా సముచిత రీతిలో సహాయం చేయాలని విన్నవించారు. రాత్రి 9:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. (చదవండి: ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
Advertisement