రాజ్యాంగం జోలికెళ్తే రక్తపుటేర్లే : సీఎం | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం జోలికెళ్తే రక్తపుటేర్లే : సీఎం

Published Tue, Apr 24 2018 7:49 AM

CM Siddaramaiah Fires On Constitution Changes - Sakshi

మైసూరు: డాక్టర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో హర్షించాయని, అటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే దేశంలో రక్తపుటేర్లు పారుతాయంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. సోమవారం మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గంలో ఆయన హోసహోటె, హదినారు, తాండవపురల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు తప్ప అభివృద్ధి ఊసే లేకుండా పోయిందన్నారు.

గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్నారు. వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికలు మతఛాందసవాద పార్టీకి,అభివృద్ధి పక్షపాతి పార్టీకి మధ్య జరుగనున్న యుద్ధమని అందులో ప్రజలు అభివృద్ధి పక్షపాతి పార్టీ కాంగ్రెస్‌కే మద్దతు తెలపాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే సహించబోమని బీజేపీని హెచ్చరించారు. గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశామని ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని,  అందుకే ఈసారి కూడా కాంగ్రెస్‌కే పట్టం గట్టాలని ఓటర్లను కోరారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో దళితుల కోసం రూ.22 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఈఐదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.89వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. తనకు చాముండేశ్వరి,వరుణ రెండు కళ్లలాంటివని, రెండు నియోజకవర్గాలను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా చేస్తామని అన్నారు. 

Advertisement
Advertisement