టార్గెట్‌ యూసఫ్‌ అజహర్‌ | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ యూసఫ్‌ అజహర్‌

Published Wed, Feb 27 2019 3:24 AM

India has been attacked by lightning on territorial bases - Sakshi

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన మెరుపుదాడి అసలు లక్ష్యం జైషే కీలక నేత మౌలానా యూసఫ్‌ అజహర్‌ అలియాస్‌ ఉస్తాద్‌ ఘారీయే. జైషే అధినేత మసూద్‌ అజహర్‌ బావమరిది అయిన యూసఫ్‌ అజహర్‌... జైషే తరఫున భారత్‌లో ఉగ్ర దాడులకు వ్యూహాలు రచించడంతోపాటు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాడు. 1999లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌కు కుట్ర పన్నింది యూసఫ్‌ అజహరే. కశ్మీర్‌ జైలులో ఉన్న జైషే అధినేత మసూద్‌ అజహర్‌ను విడిపించేందుకు యూసఫ్‌ శతవిధాలా ప్రయత్నించాడు. జైలు బద్దలుకొట్టి మసూద్‌ను విడిపించేందుకు కూడా విఫలయత్నం చేశాడు.

ఆ తర్వాత అబ్దుల్‌ లతీఫ్‌ అనే ఉగ్రవాదితో కలసి విమానం హైజాక్‌కు కుట్ర పన్నాడు. దాని ప్రకారం నేపాల్‌ రాజధాని కఠ్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని 1999 డిసెంబర్‌ 24న యూసఫ్‌ నాయకత్వంలోని ఉగ్రవాదులు హైజాక్‌ చేశారు. అమృత్‌సర్, లాహోర్, దుబాయ్‌ మీదుగా చివరకు అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తరలించారు. విమానంలో ఉన్న 179 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందిని విడుదల చేయాలంటే జైల్లో ఉన్న మసూద్‌ తదితరులను వదిలిపెట్టాలని డిమాండ్‌ చేశారు. వారంపాటు చర్చోపచర్చలు జరిగిన మీదట ప్రభుత్వం మసూద్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్ర నేతలను కూడా విడుదల చేసింది. సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ 2000 సంవత్సరంలో యూసఫ్‌పై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. 

Advertisement
Advertisement