Sakshi News home page

బాబు వచ్చే..జాబు పోయే

Published Tue, May 5 2015 12:08 AM

బాబు వచ్చే..జాబు పోయే

తొలగింపు ‘జాబు’తో హామీని నెరవేర్చుతున్న సీఎం
 సిబ్బంది ధర్నాలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యంగ్యాస్త్రాలు

 
దోమలగూడ: లక్ష మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తొలగింపు ఉత్తరం (జాబు) పంపడంతో  ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చుతున్నాడని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ గృహ నిర్మాణ సంస్థలో తొలగించిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని సంస్థ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. తొలుత సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ..కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని  చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చాక విద్యుత్తు సంస్థలో 25 వేల మందిని తొలగించి ఒక్కో ఉద్యోగాన్ని నాలుగు, అయిదు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 

రేషన్ డీలర్లను తొలగించి పార్టీ కార్యకర్తలను నియమించుకున్నారని, ఐకేపీ యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఆదర్శ రైతులు, కాంట్రాక్ట్ సిబ్బంది తొలగించాడని విమర్శించారు. ప్రస్తుతం 17 లక్షల ఇళ్ల నిర్మాణం జరపాల్సి ఉందని, సిబ్బందిని తొలగించడంతో నిర్మాణాలు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు.  సీపీఎం కేంద్ర  కార్యవర్గ సభ్యుడు ైవె . వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వమనడం లేదని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మాత్రమే కోరుతున్నారని అన్నారు. రాష్ర్టంలో మొట్ట మొదటి కార్మికుడిని నేనే అని చెప్పుకునే చంద్రబాబుకు తోటి కార్మికుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, నాయకులు జనార్దన్‌రెడ్డి, ఏపీ గృహ నిర్మాణ సంస్థ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు లక్ష్మయ్య, నాయకులు అలీ, సునీల్‌కుమార్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement