ఐఐటీ-రూర్కీలో పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు | Sakshi
Sakshi News home page

ఐఐటీ-రూర్కీలో పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు

Published Thu, Jul 31 2014 2:12 AM

ఐఐటీ-రూర్కీలో పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు

 కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే ఎలా?
 -సుశాంత్, హైదరాబాద్..

  కస్టమ్స్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించడానికి రెండు మార్గాలున్నాయి. అవి యూపీఎస్సీ-సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఎస్‌ఎస్‌సీ-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తుంది. దీని ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్.. తదితర అఖిల భారత సర్వీస్ అధికారుల భర్తీ జరుగుతుంది. ఈ సర్వీసుల్లోని ఐఆర్‌ఎస్ (ఐఆర్‌ఎస్‌లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్‌కం ట్యాక్స్ అనే రెండు విభాగాలు ఉంటాయి)కు ఎంపికకావడం ద్వారా అసిస్టెంట్ కమిషనర్ హోదాలో కస్టమ్స్ విభాగంలో కెరీర్ ప్రారంభించవచ్చు. ఎంపికైన వారికి నేషనల్ అకాడెమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ (ఎన్‌ఏసీఈఎన్)-ఫరీదాబాద్‌లో శిక్షణనిస్తారు. సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు హాజరు కావచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలుగా

  ఉంటుంది. వివరాలకు: www.upsc.gov.in
 స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ), నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇన్‌స్పెక్టర్ హోదాలో కస్టమ్స్ విభాగంలో కెరీర్ ప్రారంభించవచ్చు. కావల్సిన అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి. ఇందుకోసం నిర్వహించే రాత పరీక్ష.. రెండు దశల్లో (టైర్ 1, టైర్ 2) ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి తర్వాత దశలో పర్సనల్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. దీని ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు.
 వివరాలకు: http://ssc.nic.in
 
 ఎంబీఏ (ఫార్మా మేనేజ్‌మెంట్) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
 -సతీష్, నిజామాబాద్.
 ఫార్మసీ రంగానికి నూతన ఔషధాలను కనిపెట్టడంతోపాటు వాటిని మార్కెటింగ్ చేయడం కూడా సవాలుగా మారింది. దాంతో పలు ఫార్మా కంపెనీలు మార్కెటింగ్ సంబంధిత విభాగాలను పర్యవేక్షించడం కోసం వృత్తి నిపుణులను నియమించుకుంటున్నాయి.ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విద్యాసంస్థలు ఫార్మసీ రంగంలో మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సు చేయడం ద్వారా ఫార్మాస్యుటికల్, కెమికల్, బయోటెక్నాలజీ సంస్థలు, పరిశోధన, విద్యాసంస్థల్లో మేనేజిరియల్ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
 
 ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, హైదరాబాద్.
 వెబ్‌సైట్: www.niperhyd.ac.in
 నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ముంబై
 వెబ్‌సైట్: www.nmims.edu
 
 ఐఐటీ-రూర్కీ అందజేస్తున్న పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు వివరాలను తెలపండి?
 -శ్రీను, నిర్మల్.
 
 ఐఐటీ-రూర్కీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పాలిమర్ అండ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ బీటెక్ (పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ) కోర్సును నిర్వహిస్తుంది. బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్, పాలిమర్ అంశాల సమ్మిళితంగా ఈ కోర్సును రూపొందించారు. ద్వితీయ సంవత్సరం నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ సైన్స్ వంటి అంశాలను బోధిస్తారు. చివరి రెండేళ్లు పాలిమర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి అంశాలు ఉంటాయి. పాలిమర్స్, వాటి లక్షణాలు, సంశ్లేషణ, పరీక్షించే విధానం గురించి పాలిమర్ టెక్నాలజీలో అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సులో కెమికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సెన్సైస్‌లకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు.
 
 పాలిమర్ అనువర్తనాలను సాధారణంగా నానోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో వినియోగిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి పాలిమర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, పెట్రోలియం-గ్యాస్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆటోమొబైల్ వంటి రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఆయా రంగాల్లో కంట్రోల్ ఇన్‌స్పెక్టర్స్, టెక్నాలజిస్ట్స్, ప్రొడక్షన్ ఇంజనీర్స్, పాలిమర్ ఇంజనీర్లుగా స్థిర పడొచ్చు. వివరాలకు: www.iitr.ac.in
 
 స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్) వివరాలను తెలపండి?
 -చరణ్, గద్వాల.అమెరికాలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయి కోర్సుల్లో అంతర్జాతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పించే పరీక్ష స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎస్‌ఏటీ). దీన్ని కాలేజ్ బోర్డ్-యూఎస్‌ఏ అభివృద్ధి చేసింది. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ నిర్వహిస్తోంది. క్రిటికల్ రీడింగ్, మ్యాథమెటిక్స్, రైటింగ్ విభాగాల్లో శాట్ పరీక్ష జరుగుతుంది. ఇందుకు కేటాయించిన సమయం మూడు గంటల 45 నిమిషాలు.
 
 శాట్‌లో  సబ్జెక్టు టెస్టులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఇంగ్లిష్, హిస్టరీ, సెన్సైస్, మ్యాథమెటిక్స్, ఫారెన్‌లాంగ్వేజెస్ తదితర 20 విభాగాల్లో ఈ సబ్జెక్టు టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ టెస్టుల్లో ఉత్తీర్ణత ఫలితంగా సంబంధిత విభాగానికి చెందిన కోర్సులో ప్రవేశానికి అవకాశాలను  మెరుగుపరచుకోవచ్చు. ఏడాదిలో పలు మార్లు శాట్ పరీక్ష జరుగుతుంది. అయితే దరఖాస్తు చేసుకున్న కాలేజీ అకడమిక్ షెడ్యూల్‌కు అనుగుణంగా శాట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
 
 ఈ ఏడాది అక్టోబర్ 11, నవంబర్ 8, డిసెంబర్ 6 తేదీల్లో శాట్ పరీక్షను నిర్వహిస్తారు.
 రిజిస్ట్రేషన్ ఫీజు: 52.50 యూఎస్ డాలర్లు.శాట్‌కు హాజరవాలనుకున్న అభ్యర్థులు కాలేజ్ బోర్డ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందుబాటులో ఉన్న తేదీల్లో తమకిష్టమైన తేదీలో ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
 వివరాలకు: www.collegeboard.com,
     www.ets.org
 

Advertisement
Advertisement