Sakshi News home page

మంచినీళ్లిచ్చే దిక్కులేదు

Published Wed, Nov 25 2015 2:46 AM

మంచినీళ్లిచ్చే దిక్కులేదు - Sakshi

మానవత్వంలేని సర్కారిది
వరద బాధితులు పస్తులున్నా కనికరించలేదు
బాధితులకు ఇచ్చే సాయంలోనూ వివక్ష
చంద్రబాబుది అడుగడుగునా మోసం.. దగా
ఇన్‌పుట్ సబ్సిడీ, రుణమాఫీల్లో రైతులను మోసం చేశారు
వరదలొచ్చాక కరువు మండలాలు ప్రకటించారు
ఇప్పుడు సర్వే చేస్తే ఇన్‌పుట్ సబ్సిడీ వస్తుందా?
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘మానవత్వం లేని ప్రభుత్వమిది. సర్వం కోల్పోయిన వారికి కనీసం మంచినీరిచ్చే దిక్కులేదు. పస్తులున్నా కనికరించలేదు. కంటితుడుపుగా ఒకటి రెండు రోజులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. బాధితులకు ఇచ్చే సాయంలోనూ వివక్ష చూపుతున్నారు. కొంతమందికి ఇస్తున్నారు. మరి కొంతమందికి ఇవ్వటం లేదు. కనీసం బాధితులను పరామర్శించిన పాపానపోలేదు. వరద బాధితులను పట్టించుకోరా?’’ అంటూ  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారుపై ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు జీవితమంతా మోసమేనని.. అబ ద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. వరదలకు పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన సీఎం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
 
 ఆయన మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పరిధిలోని బంగారుపేటలోని వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతోనూ మాట్లాడుతూ... చంద్రబాబు కరువు మండలాలను ప్రకటించిన తీరును దుయ్యబట్టారు. గతంలో 196 కరువు మండలాలను ఆలస్యంగా ప్రకటించి ఎన్యుమారేషన్ సర్వే పూర్తిచేయలేదని గుర్తుచేశారు. కరువు మండలాలపై కేంద్రం చీవాట్లు పెట్టిన తర్వాత మరోసారి 163 కరువు మండలాలను ప్రకటించారని తెలిపారు. మొదట్లో ప్రకటించిన సమయంలో ఈ 163 మండలాలను ఎందుకు ప్రకటించలేదన్నారు. వాస్తవంగా అయితే సెప్టెంబర్ 30కంతా నోటిఫై చేసి అక్టోబర్ రెండో వారంలోపు కేంద్రానికి రిపోర్ట్ చేయాల్సి ఉండగా.. నవంబర్‌లో ప్రకటించారని చెప్పారు. అయితే ఈ రోజుకీ పాతవాటికి సంబంధించి ఎన్యుమరేషన్ చేయకపోవటాన్ని తప్పుబట్టారు. కరువు మండలాల్లో ఇప్పుడు సర్వే చేస్తే ఇన్‌పుట్ సబ్సిడీ వస్తుందా? అని ప్రశ్నించారు.
 
 ఎన్నికల ముందో మాట.. తరువాత మరోమాట
 చంద్రబాబు జీవితాంతం మోసాలు.. అబద్ధాలతోనే ప్రజలను మభ్యపెడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు మాఫీ, ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి ఇస్తానని చెప్పి ఓట్లేయించుకున్నారని గుర్తుచేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలోనూ ఎన్నికల ముందు రూ.1,690 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత మాటమార్చారని విమర్శించారు. 2014-15 సంవత్సరానికి రూ.736 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా.. అందులో రూ.254 కోట్లు మాత్రం ఇచ్చారని తెలిపారు. ఇలా అడుగడుగునా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

Advertisement

What’s your opinion

Advertisement