ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణేలు చెల్లుబాటు


కర్నూలు(రాజ్‌విహార్‌): ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని రీజినల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల రూ.10 నాణేలు చెల్లవంటూ ప్రచారం జరుగుతోందని, అయితే ఆర్టీసీ బస్సుల్లో వాటిని తీసుకోవాలని డిపో మేనేజర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే కండక్టర్ల నుంచి కూడా రూ.10 నాణేలు తీసుకుని ప్రయాణికులు సహకరించాలని కోరారు. వీటిపై ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించుకునేందుకు స్థలాలను అద్దెకు ఇస్తామని, వీటిపై సమీక్షించేందుకు ఈడీలు శశిధర్, రామారావు శనివారం కర్నూలుకు రానున్నట్లు వెల్లడించారు.

 
Back to Top