Sakshi News home page

కూలిన పూరిళ్లు.. పశువుల శాల

Published Sat, Sep 24 2016 8:59 PM

కూలిన పూరిళ్లు.. పశువుల శాల - Sakshi

గోడ కూలడంతో కొనఊపిరితో ఆవు
నిండుకుండల్లా చెరువులు, బందలు
 
 
పార్వతీపురం రూరల్‌: చినబొండపల్లిలో శుక్రవారం రాత్రి కురిసిన వానకు గ్రామానికి చెందిన కోట సూర్యనారాయణ, కోట జోగినాయుడులకు చెందిన పూరిళ్లు కూలిపోయాయి. పక్కనేవున్న చప్ప రాములు పశువుల శాలలో కట్టిన ఆవుపై గోడ పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. పూర్తిగా రెండు కాళ్లు చచ్చుపడిపోవడంతో లేవలేక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆవును రక్షించేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. దీంతో ఆవు యజమాని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మరోవైపు మండలంలో చెరువులు, బందలు నిండుకుండల్లా ఉన్నాయి. రెండ్రోజులు కురిస్తే చాలా చెరువులు గండ్లు కొట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. సాకిగెడ్డ, బడిదేవరగెడ్డ, వరహాలగెడ్డ ఉధతంగా ప్రవహిస్తున్నాయి. పెదబొండపల్లిలోని తామర చెరువు, నర్సిపురంలోని ముసలినాయుడు చెరువు, అప్పలనాయుడు చెరువు, బందలుప్పిలోని ఊరచెరువులు పూర్తిగా నిండి ఉన్నాయి. 
 
ఆవే జీవనాధారం– చప్పరాములు, చినబొండపల్లి
 
ఆవే మాకు జీవనాధారం. శాలలో కట్టిన ఆవుపై గోడ కూలడంతో మా బతుకులపై పిడుగు పడినట్టయింది. ఆవు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎలా బతకాలో దిక్కుతోచడం లేదు. 
 
వర్షాలు ఆగితే మేలు– దొగ్గ శ్రీరాములు, రైతు, నర్సిపురం
 
ఇప్పటి వరకు మండలంలో కురిసిన వర్షాలు ఖరీఫ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇంకా కురిస్తే చెరువులకు గండ్లు పడే అవకాశాలున్నాయి. కొద్ది రోజులపాటు వర్షం ఆగితే బాగుంటుంది.
 
 
24పీపీఎం02ఎ,బి: చినబొండపల్లిలో కూలిన పూరిళ్లు, పశువుల శాల
 

Advertisement

తప్పక చదవండి

Advertisement