నవ శకానికి అడుగులు.. | Sakshi
Sakshi News home page

నవ శకానికి అడుగులు..

Published Sat, Jan 5 2019 8:27 AM

YS Jagan Praja Sankalpa Yatra in Srikakulam  - Sakshi

శ్రీకాకుళం, అరసవల్లి: రాజన్న బిడ్డ జగనన్నను చూడాలన్న వేలాది మంది ఎదురుచూపులు... వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలే శక్తి మంత్రంగా, యాత్రకు ఇంధనంగా పనిచేస్తున్నాయి. వేలాది కిలోమీటర్లుగా అడుగులతోనే పయనం చేస్తున్న ఆ పాదయాత్రికుడు మరికొద్ది రోజుల్లోనే తుది లక్ష్యాన్ని చేరుకోనున్నారు. ఎండనక, వాననక..పెనుగాలులైనా లెక్కచేయక ప్రజా సమస్యలపై యుద్ధం చేసేందుకు, రాష్ట్రంలో ‘నారా’సుర పాలనను అంతం చేసేందుకు లక్ష్యంగా వస్తున్న రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 336 రోజులు పూర్తయ్యింది. ప్రజల కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూస్తూ.. బాధితుల ఆవేదనను అర్థం చేసుకుంటూ...శాశ్వత పరిష్కారానికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో పాదయాత్రగా వెళ్తున్న జగన్‌ను చూసేందుకు, ఆయన చల్లని చూపు తమపై పడాలనే ఆకాంక్షతో...ఆయన వెంటే అడుగులు వేస్తూ.. వేలాది మంది మద్దతు ప్రకటిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో పాదయాత్ర దిగ్విజయంగా సాగడం సంచలనంగా మారింది. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పుల దిశగానూ, అలాగే అత్యంత ప్రధానంగా పేద, సామాన్య ప్రజల సంక్షేమమే పరమా«వధిగా సాగుతున్న జగన్‌ పాదయాత్ర.. ప్రస్తుత అధికార పక్షానికి నిద్రలేకుండా చేస్తోందనడంలో అతిశయోక్తి కాదు. ఇదిలావుంటే 337వరోజు శనివారం ఉదయం నుంచి సోంపేట మండలంలోని తురకశాసనం నుంచి జగన్‌ యాత్ర కొనసాగించనున్నారు.  

తుది అంకానికి పాదయాత్ర
ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరింది. కేవలం ప్రజాసంక్షేమం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తూ.. సంచలనంగా ప్రకటించిన ప్రజాసంకల్పయాత్రను 2017 నవంబర్‌ 6న వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయ (దివంగత వైఎస్సార్‌ సమాధి) నుంచి ప్రారంభించిన జగన్, అలుపెరగని ధీరుడిలా రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాలను పూర్తి చేసుకుని, తుదిగా శ్రీకాకుళం జిల్లాలో యాత్రను గతేడాది నవంబర్‌ 25న పాలకొండ నియోజకవర్గంలో ప్రారంభించిన సంగతి విదితమే..నాటి నుంచి నేటి వరకు దిగ్విజయంగా వేలాది మంది మద్దతుతో పాలకొండ,రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస నియోజకవర్గాలను పూర్తి చేసుకుంది. తుది అంకంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలోనే 277.8 కిలోమీటర్లు మేరకు జగన్‌ పాదయాత్రను పూర్తి చేశారు. ఇడుపులపాయ – ఇచ్ఛాపురం వరకు సంకల్పించిన ఈయాత్ర ఆఖరి నియోజకవర్గంలో సాగుతుండడంతో దాదాపుగా తుది అంకానికి చేరుకున్నట్లయ్యింది. ఈ మేరకు ఈ నెల 9న ఇచ్ఛాపురంలో సంకల్పయాత్రను ముగించేందుకు అన్ని ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 3,593.6 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న జగన్‌ పాదయాత్ర బుధవారం (9వ తేదీ)తో  సంపూర్ణం కానుంది.

చిరస్థాయిగా పైలాన్‌ నిర్మాణం
ప్రజాసంకల్పయాత్ర పూర్తి కానున్న నేపథ్యంలో ఇచ్ఛాపురంలో ఈ నెల 9న ‘విజయ సంకల్ప’ స్థూపాన్ని జగన్‌ ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అద్భుత రీతిలో పైలాన్‌ను నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేశారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న పైలాన్‌ను ఇటు పర్యాటకంగా, అటు రాజకీయ స్ఫూర్తి కేంద్రంగా తీర్చిదిద్దేలా వైఎస్సార్‌సీపీ కీలక నేతలు చర్యలు చేపడుతున్నారు. పైలాన్‌ నిర్మాణ పనులను రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, టూర్‌ ప్రోగాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం పర్యవేక్షిస్తున్నారు. పైలాన్‌ నిర్మాణంలో 13 జిల్లాలకు 13 మెట్లు ఆనవాళ్లుగా ఉంచుతూ, పార్టీ జెండాలోని మూడు రంగులతో కూడిన ఒక టోంబ్‌ను అమర్చారు. పైలాన్‌ అగ్రభాగాన వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ విజయ సంకల్ప స్థూపానికి చేరుకోనున్న విజేయుడ్ని చూసేందుకు, భారీ బహిరంగ సభకు వచ్చేందుకు శ్రీకాకుళం జిల్లాతోపాటు రాష్ట్ర  నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో స్థిరపడిన వారు కూడా వచ్చేందుకు సన్నాహాలు చేసుకున్నారు.

నేడు పాదయాత్ర సాగేదిలా...
ఇప్పటివరకు నడిచిన దూరం – 3593.6 కిలోమీటర్లు337వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 7.30 గంటలకు ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలోని సోంపేట మండలం తురకశాసనం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలియజేశారు. ఈక్రమంలో పాలవలస, కొర్లాం వరకు యాత్ర సాగించి, ఇక్కడే మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బారువ కూడలి, లక్కవరం క్రాస్‌ వరకు యాత్ర సాగనుందని తెలిపారు. ఇక్కడే జగన్‌ రాత్రి బస చేయనున్నారు.

Advertisement
Advertisement