ఆశలు చిగురించిన వేళ.. | Sakshi
Sakshi News home page

ఆశలు చిగురించిన వేళ..

Published Sat, Jul 21 2018 6:55 AM

Unemployeed Youth Happy On YS Jagan Promis On Jobs Fills - Sakshi

‘‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 42 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏపీపీఎస్సీ, డీఎస్సీ నోటిఫికేషన్లన్నీ క్రమం తప్పకుండా విడుదల చేసి ఉద్యోగాలిస్తాం. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తాం. ఒక్కో గ్రామ సచివాలయంలో 10 మందికి ఉద్యోగాలిస్తాం. ఈ లెక్కన లక్షా 50 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో స్థానికులకు తప్పనిసరిగా 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం చేస్తాం. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఆ మేరకు చట్టానికి రూపకల్పన చేస్తాం.– వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన భరోసా ఇది.జననేత ఇచ్చిన ఈ హామీ నిరుద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అలా ఇవ్వలేకపోతే ప్రతి నిరుద్యోగికీ రూ.2 వేల భృతి అందజేస్తామని ఆశ పెట్టారు. యువతను నమ్మించి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల గొంతు కోశారు. నాలుగేళ్లయినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పొట్ట చేత పట్టుకుని వేలాదిగా నిరుద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడం లేదు. జారీ చేసిన ఒకే ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా కార్యరూపం దాల్చలేదు. అలాగని నెలకు రూ.2 వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతికి నేటికీ మోక్షం కలగలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాత్రం రకరకాల ఆంక్షలతో వెయ్యి రూపాయల భృతి ఇస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు.

ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన‘పచ్చ’ ప్రభుత్వం
కొత్తగా ఉద్యోగాలివ్వడం మాట పక్కన పెడితే కంప్యూటర్‌ టీచర్లు, ఆదర్శ రైతులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, విద్యా వలంటీర్లు తదితర తాత్కాలిక పోస్టుల్లో పని చేస్తున్న వేలాది మందిని ఉన్నపళంగా తీసేసి రోడ్డున పడేశారు. చివరికి ఔట్‌సోర్సింగ్‌ పోస్టులను సహితం తగ్గించేస్తున్నారు. ఉన్నవారికి జీతాలు చెల్లించకుండా నరకం చూపిస్తున్నారు. దీంతో వేలాదిమంది ఉపాధి కోల్పోయి కష్టాలపాలయ్యారు.

నిరుద్యోగుల నిరీక్షణ
కాకినాడలోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇప్పటివరకూ 91,053 మంది నిరుద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. వీరందరూ ఉద్యోగాల కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. ఇక, ఉపాధి కల్పనా కార్యాలయంలో నమోదు చేసుకోని నిరుద్యోగుల సంఖ్య 2 లక్షలకు పైగా ఉంది. భద్రత లేని ప్రైవేటు ఉద్యోగాలు తప్ప మరో ఆధారం లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం నానాటికీ తీసికట్టుగా మారింది. ప్రస్తుతం జిల్లాలో పంచాయతీ, రెవెన్యూ తదితర శాఖల్లో 35 వేల మంది ఉద్యోగులున్నారు. ఆయా శాఖలన్నీ కలిపి 10 వేలకు పైగా పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను జిల్లా ఉపాధి కల్పనాధికారి ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా ఆ ఊసే లేదు. ఇంతవరకూ ఆ కార్యాలయం నుంచి నిరుద్యోగులకు ఒక్క కాల్‌ లెటర్‌ కూడా వెళ్లలేదు. ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 8,51,587 కుటుంబాలున్నాయి. ఈ లెక్కన ఎన్ని ఉద్యోగాలు రావాలో అర్థం చేసుకోవచ్చు.

హామీ ప్రకారం ఇవ్వాల్సిన భృతి రూ.874 కోట్లు
ఉద్యోగం ఇవ్వకపోతే భృతి ఇస్తానన్న చంద్రబాబు ప్రకటన ప్రకారం.. జిల్లాలో 91,053 మందికి లబ్ధి చేకూర్చాలి. ఈ హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.2 వేల చొప్పున 48 నెలలకు రూ.96 వేలు ఇవ్వాలి. ఈ లెక్కన ఉపాధి కల్పనా కార్యాలయంలో నమోదు చేసుకున్న నిరుద్యోగులకు సుమారు రూ.874 కోట్ల వరకూ చెల్లించాలి. కానీ, ఈ విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. ప్రకటించిన రూ.2 వేలను తూచ్‌ అనేసి రూ.వెయ్యికి ప్రతిపాదించారు. ఇందులో కూడా వడబోత చేస్తున్నారు. 22 నుంచి 35 ఏళ్ల వయస్సు లోపు డిగ్రీ, డిప్లమో పూర్తి చేసిన నిరుద్యోగులకు మాత్రమేనని ఆంక్షలు పెట్టారు. ఈ లెక్కన చూస్తే 17 వేల మంది డిగ్రీ, 4,300 మంది డిప్లమో చేసిన నిరుద్యోగులే అర్హులవుతారు. వీరు కూడా నిబంధనలకు లోబడి ఉండాలి. ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి. కచ్చితంగా తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలి, స్థానికుడై, ఓటు హక్కు కలిగి ఉండాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. వీటి పరిధిలోకి వసేన్తే సదరు నిరుద్యోగి భృతికి అర్హులవుతారు. గరిష్టంగా 2.5 ఎకరాల పల్లం, 5 ఎకరాలు మెట్ట భూమి ఉన్నవారు, నాలుగు చక్రాల వాహనాలు కలిగినవారు, డిగ్రీ, డిప్లమో పూర్తి చేసినప్పటికీ ప్రస్తుతం ఏదైనా చదువుకుంటున్నవారు, పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్నవారు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, సంక్షేమ శాఖల ద్వారా రుణాలు పొందినవారు అనర్హులుగా మిగిలిపోతారు.

జగన్‌ ప్రకటనతో ఊరట
ఇలా చంద్రబాబు పాలనలో పూర్తిగా వంచనకు గురైన నిరుద్యోగులకు.. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. మాట ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు తీరును తలుచుకుని కుమిలిపోతున్న వారికి ఉపశమనం కలిగింది. ఖాళీ పోస్టుల భర్తీతోపాటు గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించనుండటంతో తమకు సర్కారీ నౌకరీ దొరుకుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఎప్పుడొస్తుందా.. అని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement