Sakshi News home page

‘ధవళ’కు వాగ్దేవి కళాయశస్వి పురస్కారం

Published Wed, Mar 27 2024 1:00 AM

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డాక్టర్‌ పెన్నేటి స్వప్న హైందవి - Sakshi

విజయనగరం టౌన్‌: ప్రముఖ సాహితీవేత్త, సేవాతత్పరుడు ధవళ సర్వేశ్వరరావుకు వాగ్దేవి కళాయశస్వి పురస్కారం అందజేయనున్నట్లు వాగ్దేవి సమారాధనం జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర సంప్రదాయ పరిరక్షణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్‌ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక గురజాడ స్వగృహంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్‌ 9న ఉగాది రోజున వాగ్దేవి సమారాధనం సంస్థ నాలుగవ వార్షికోత్సవాన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయం మేడపైన ఉన్న చా.సో భవనంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సనాతన గురుకుల ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి హాజరుకానున్నారని తెలిపారు. ఇటీవల కీర్తిశేషులైన సంస్థ కోశాధికారి దేవరాజు గోపాలకృష్ణ జ్ఞాపకార్థం ఆయన సేవలను గుర్తిస్తూ ప్రముఖ సాహితీవేత్త ధవళ సర్వేశ్వరరావుకు పురస్కారం అందజేస్తున్నామని తెలిపారు. ఆయనతో పాటు సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక రంగాల్లో పేరెన్నికగన్న మరో 15 మందికి ఉప పురస్కారాలు ఉంటాయన్నారు. తనికెళ్ల వెంకట నాగ ప్రభాకర శాస్త్రి పంచాంగ శ్రవణం, 20 మందితో కవిసమ్మేళనం, చిన్నారుల నృత్యప్రదర్శన ఉంటాయన్నారు. అదేవిధంగా ఏప్రిల్‌ 7వ తేదీన నామరామాయణం గోష్టి గానం పోటీలు గురజాడ స్వగృహంలో నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫోన్‌ 8790607303 నంబర్‌ను సంప్రదించి పేర్లను నమోదుచేసుకోవాలని కోరారు. ఉగాది రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కార్యక్రమాలు ఉంటాయని, అభిమానులందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షులు పీవీఎల్‌.సుబ్బారావు, భోగరాజు సూర్యలక్ష్మి, గౌరవ అధ్యక్షులు ముళ్లపూడి సుభద్రాదేవి, గురజాడ ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement