Sakshi News home page

ఎన్సీపీకి ధనంజయ్ ముండే రాజీనామా

Published Wed, Oct 22 2014 11:42 PM

Dhananjay Munde Resignation to NCP

సాక్షి, ముంబై: బీజేపీకి చెందిన దివంగత సీనియర్ నేత గోపినాథ్ ముండే సోదరుడి కుమారుడైన ఎన్సీపీ నాయకుడు ధనంజయ్ ముండే శాసనసభ మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీడ్, పర్లీలో ఎన్సీపీ అభ్యర్థులు ఘోరపరాజయం పాలవ్వడంతో  నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేసినట్టు బుధవారం ఆయన ప్రకటించారు. ఈయనపై గోపినాథ్ ముండే కుమార్తె పంకజా ముండే 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. పర్లీతోపాటు బీడ్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలుండగా వీటిలో అయిదింటిలో ఎన్సీపీ అభ్యర్థులు ఓడిపోయారు. కాగా, ఎన్సీపీకి రాజీనామా చేసిన ధనంజయ్ భవిష్యత్తులో బీజేపీలో చేరనున్నట్టు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఎమ్మెన్నెస్ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రవీణ్ ...
మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ దరేకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని బుధవారం రాజ్ ఠాక్రేకు అందించారు. తాను పదవికి మాత్రమే రాజీనామా చేశానని కాని పార్టీలోనే కొనసాగనున్నట్టు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్‌కు ముంబైలో ఒక్క సీటు కూడా లభించలేదు. దీనిపై ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకుడైన బాలా నాందగావ్కర్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలు సరిగా పనిచేయకపోవడం వల్లే పార్టీ ఓటమి పాలైనట్టు వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన ప్రవీణ్ దరేకర్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement