స్వైన్‌ ఫ్లూతో మరో ఇద్దరి మృతి


45 రోజుల్లో 12 మంది మృత్యువాత.. 183 కేసులు నమోదుహైదరాబాద్‌: రాజధానిలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా మరో ఇద్దరిని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన వెంకటరాంరెడ్డి (35), మెదక్‌ జిల్లా ఆర్‌సీపురం ఎస్‌ఎన్‌ కాలనీవాసి రవీంద్ర (53) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వెంకటరాంరెడ్డి స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ సన్‌రైజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి 6.30 గంటలకు రిఫరల్‌పై గాంధీకి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన కొద్ది సేపటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి ఫ్లూ పాజిటివ్‌తో పాటు హెచ్‌ఐవీ, టీబీ, బీపీ కూడా ఉన్నట్లు చెప్పారు. మరో మృతుడు రవీంద్ర (53) రెమిడీ ఆస్పత్రి నుంచి వెంటిలేటర్‌పై 14న రిఫరల్‌పై గాంధీకి వచ్చారు. ఆయన గురువారం మధ్యాహ్నం మృతిచెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 183 స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో 12 మంది మరణించారు.చివరి క్షణాల్లో వస్తున్నారు..: చివరి క్షణాల్లో వస్తుండటం వల్ల మెరుగైన వైద్య సేవలు అందించినా ఫలితం లేకుండా పోతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జేవీ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 10 మంది ఫ్లూ పాజిటివ్‌ బాధితులు, మరో పది మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, నగరంలోని పలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మరో 10 మంది స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతుండగా, 20 మందికి పైగా ఫ్లూ అనుమానితులు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 

Back to Top