Sakshi News home page

జిల్లాను వదలని ముసురు

Published Thu, Sep 1 2016 11:51 PM

జోరుగా కురుస్తున్న వర్షం

  • చెరువులు, ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద నీరు
  • పంటలకు ఉపకరిస్తున్న వానలు
  • పంటలపై అన్నదాతకు పెరుగుతున్న ఆశలు
  • ఖమ్మం వ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ  వర్షాలు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నదిలో వరద నీటి ప్రవాహం స్వల్పంగా ప్రారంభమైంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో 25 గేట్లలో 10 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల వరద నీటిని కిందకు వదులుతున్నారు. మణుగూరుపేరంటాల చెరువు, అశ్వాపురం తుమ్మల చెరువు,బూర్గంపాడు మండలంలోని దోమల వాగు చెరువు,అంకమ్మ చెరువుల్లోకి, గుమ్మడివెళ్లి ప్రాజెక్టు,పెద్దవాగు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. గుండాల అటవీ ప్రాంతం నుంచి ఉన్న కిన్నెర సాని వాగు కూడా ప్రవహిస్తుంది. దీంతో పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు వరద నీటితో నిండుతుంది.టేకులపల్లి, కొత్తగూడెం మున్నేరు వాగులో ముల్కలపల్లిలోని మూకమామిడి ప్రాజెక్టుల్లో కి ఇల్లెందు, బయ్యారం, గార్ల, కామేపల్లి మండలాల్లో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ఖమ్మం, మధిర, వైరా ప్రాంతాల్లో  వర్షాలతోప్రాజెక్టులు, చెరువులు మరోసారి జలకళతో కళకళలాడుతున్నాయి. 
    పంటలకు ఉపకరించే వానాలు
    ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ఉపకరిస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలు సాగు చేసే జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ స్థాయిలో కూడా వర్షాలు కురవక పోవటంతో జిల్లాలో ఖరీఫ్‌ విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుకోలేదు.అయితే పంటలు పూత, కాత దశలో వర్షాలు లేకపోవటంతో పలు ప్రాంతాల్లో ఎండిపోయి దిగుబడులు బాగా తగ్గిపోయాయి. మొక్కజొనl్న పంట మాత్రం బాగా దెబ్బతింది. ఇల్లెందు, బయ్యారం, గార్ల, టేకులపల్లి, గుండాల ప్రాంతాల్లో వర్షాధారంగా వేసిన ఈ పంటకు అవసరమైన సమయంలో వర్షాలు పడకపోవటంతో దెబ్బతిన్నాయి. ఎర్రదుబ్బ నేలల్లో వేసిన పంటలు దెబ్బతినగా, నల్ల నేలల్లో వేసిన పంటలు మాత్రం తేమను నిలుపుకొని,ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆశాజనకంగా మారాయి. సాగర్‌ ఆయకట్టు మినహా జిల్లాలోని పలు ప్రాజెక్టులు, చెరువుల కింద వేసిన వరి మాత్రం ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి పంటకు బాగా ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో వరి దాదాపు 75 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 
    • పంటలపై  రైతులకు చిగురించిన ఆశలు
    వర్షాధారంగా వేసిన పంటలు ఎండిపోయే దశకు చేరిన పరిస్థితుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు జీవం పోశాయి. దీంతో అన్నదాతలకు కూడా పంటలపై ఆశలు చిగురించాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళనలో ఉన్న దశలో వర్షాలు కురవటం అన్నదాత ముఖాల్లో  సంతోషం కనిపిస్తుంది. వర్షాలు ఊపందుకునే అవకాశం ఉండటంతో జిల్లాలోని భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని రైతులు ఆశగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో సాగు చేస్తున్న వరి, మిరప, మొక్కజొన్న పత్తి, పొగాకు, కంది వంటి పంటలకు ఈ వర్షం ఎంతగానో మేలు చేస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement