Sakshi News home page

మార్కాపురం టూ అసెంబ్లీ

Published Wed, Mar 22 2017 4:25 PM

మార్కాపురం టూ అసెంబ్లీ

= అసెంబ్లీ లాబీల్లో మార్కాపురం చర్చ
= ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న రియల్‌ పంచాయితీ
= చక్రం తిప్పుతున్న గుంటూరు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే


మార్కాపురం : మార్కాపురం రియల్‌ పంచాయితీ వ్యవహారం మంగళవారం అమరావతిలోని అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య చర్చకు వచ్చింది. మార్కాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి గుంటూరు జిల్లాకు చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యే ద్వారా ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. తద్వారా ఈ వ్యవహారం నుంచి బయట పడాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే.. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ ఉన్నతాధికారితో మాట్లాడతానని చెప్పినట్లు తెలిసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారంలో మార్కాపురం పోలీసులపై రామకోటేశ్వరరావు ఆరోపణలు చేయడంతో పాటు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. మార్కాపురం నియోజకవర్గ టీడీపీ నేతల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా నేతలతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశం రెండు రోజులుగా అసెంబ్లీ లాబీల్లో కూడా ఎమ్మెల్యేల మధ్య అంతర్గత చర్చల్లో వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్కాపురం రియల్‌ పంచాయితీ చర్చనీయాంశమైంది. పోలీసుల వ్యవహారశైలిపై పలు విమర్శలు వస్తున్నాయి.

దీంతో ఈ కేసు నుంచి బయటపడేందుకు సదరు టీడీపీ నేత.. మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇలా అయితే ప్రజల్లోకి ఎలా వెళ్తామని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ నేతలు అవినీతికి దూరంగా ఉండాలని హితబోధ చేస్తుండగా, పశ్చిమ ప్రకాశంలోని నేతలు మాత్రం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ పార్టీలోని కీలకమైన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మార్కాపురం సర్కిల్‌లో పలువురు పోలీసులు, అధికారులు బదిలీ కావచ్చని ప్రచారం జరుగుతోంది.   

 

Advertisement

What’s your opinion

Advertisement