Sakshi News home page

ఉన్మాది వీరంగం

Published Thu, Oct 26 2017 1:21 PM

Auto driver tries to rape two female passengers

ఓ ఆటో డ్రైవర్‌ ఉన్మాదం బొబ్బిలిలో కలకలం సృష్టించింది.  ఈ సంఘటన బొబ్బిలి పరిసర గ్రామాల వారిని ఉలిక్కిపడేలా చేసింది. మార్కెట్‌కు వచ్చి తిరిగి వెళ్లిపోతున్న వారిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్‌ వారిని గమ్యానికి చేర్చకుండా వెకిలి చేష్టలతో లైంగిక దాడికి పాల్పడి కాదన్న వారిని హతమార్చే ప్రయత్నం చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చివరకు తీవ్ర గాయాల పాలయిన వారిని అలానే వదిలేసి తిరిగి వెళ్లిపోతూ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఢీకొన్న నిందితుడ్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్తుంటే దుమికేసి పారిపోబోతుండగా ఛేజ్‌ చేసి పట్టుకుని అదుపులోకి తీసుకోవడమంతా ఇక్కడి ప్రజలకు సినిమా కథలా అనిపించింది. గాయాల పాలైన వారిలో స్వాతి కోమాలోకి వెళ్లిపోగా, స్వల్ప గాయాలతో రోదిస్తున్న పావని పోలీసులు, స్థానికులకు జరిగిన సంఘటన వివరాలు రోదిస్తూ వెల్లడించింది

బొబ్బిలి: బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన ఇజ్జురోతు చిన్న, బలరాం పిల్లలయిన ఇజ్జురోతు స్వాతి, ఇజ్జురోతు పావని ఇటీవల దీపావళి పండగ సందర్భంగా స్వగ్రామానికి  వచ్చారు. స్వాతికి వివాహమై ఏలూరులో ఉంటుండగా, పావని హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటోంది.  బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఇద్దరు అక్కాచెల్లెళ్లూ గ్రామానికి దగ్గర్లోనే ఉన్న బొబ్బిలి పట్టణానికి షాపింగ్‌ నిమిత్తమై వచ్చారు. షాపింగ్‌ పూర్తయ్యాక రాత్రి 7.15 గంటలకు ఇక్కడి చర్చి సెంటర్‌లో తిరిగివెళ్లిపోయేందుకు వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో గొల్లపల్లికి చెందిన వంజరాపు నరేష్‌ (35) అనే ఆటో డ్రైవర్‌ ఆటో ఎక్కండనడంతో మేమిద్దరమే ఉన్నాం ఆటోలో ప్రయాణికులంతా వచ్చే వరకూ ఉండాలి కదా అన్నారు. దీనికి నరేష్‌ లేదు నేను వెంటనే ఆటో తీస్తున్నాననడంతో ఇద్దరూ అందులో ఎక్కారు. అక్కడి నుంచి వస్తుండగా ఆటోను ఆపకుండా వెళ్లిపోవడంతో  ఆటో డ్రైవర్‌ని చూసి భయపడ్డారు. అంతలో జగన్నాధపురం వచ్చేసరికి ఇద్దరిలో స్వాతి అనే అమ్మాయిపై లైంగిక దాడి చేయబోయాడు.

దీనికి ఆమె ప్రతిఘటించింది. దీంతో పావనిని పట్టుకోబోయాడు. ఆమె కూడా మా అన్నయ్య వాళ్లకు ఫోన్‌ చేస్తానని సెల్‌ తీయడంతో  ఆగ్రహం పట్టలేక పక్కనే ఉన్న ఇనుప రాడ్‌తో  స్వాతి తలపై రెండుసార్లు కొట్టాడు. దీంతో ఆమె ఆటోలోంచి తుళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయిన పావని ఆటోలోంచి దూకేసింది. అప్పటికే పూటుగా తాగి ఉన్న నరేష్‌  వీరిద్దరూ రోడ్డు పక్కన పడిపోవడంతో  అక్కడి నుంచి ఆటోలో రయ్‌మంటూ జగన్నాధపురం వైపు దూసుకువస్తూ అక్కడి ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఢీకొట్టాడు. ఈలోగా కోమటిపల్లికి చెందిన శంకరరావు ఏమైందంటూ గాయాలపాలై రోడ్డున పడి ఉన్న ఆమ్మాయిలను చూశాడు. ఆ తరువాత అదే గ్రామానికి చెందిన గణేష్‌ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్‌కు సమాచారమందించారు. వెంటనే బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించగా ప్రాథమిక వైద్యం అందజేసిన వైద్యులు విజయనగరం రిఫర్‌ చేశారు. పావని చెప్పిన వివరాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల బైక్‌ నుంచి దూకేసిన నిందితుడు  
కాగా నిందితుడ్ని జగన్నాధపురంలో పట్టుకున్న పోలీసులు బైక్‌పై తీసుకువస్తుండగా బొబ్బిలి పట్టణంలో దుమికేసాడనీ, అతనిని ఛేజ్‌ చేసి పట్టుకున్నామనీ పోలీసులతో వెళ్లిన యువకులు తెలిపారు. అక్కడి నుంచి బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి స్టేషన్‌ ఆధీనంలో ఉంచారు.

నేరస్తుల జాబితాలో నిందితుడు...
నిందితుడు వంజరాపు నరేష్‌ గతంలో పలు కేసుల్లో నిందితుడే అని ఎస్‌ఐ బి.రవీంద్రరాజు విలేకర్లకు తెలిపారు. జేబుదొంగగా పోలీసుస్టేషన్‌లో నిందితుల జాబితాలో నరేష్‌ ఫొటో కూడా ఉందన్నారు. అతడికి మెంటల్‌ సర్టిఫికెట్‌ ఉందని విన్నామని, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.  స్థానిక ఆటోవాలాలు నరేష్‌ ఆటోల్లో దొంగతనాలు చేస్తుంటాడని, సౌండ్‌ బాక్స్‌లు, పేపర్లు, విలువయిన వస్తువులేమయినా ఆటోల్లో ఉంటే దొంగిలిస్తాడని చెబుతున్నారు. ఆడపిల్లలు,  మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పేర్కొంటున్నారు. పైపెచ్చు తనకు మెంటల్‌ సర్టిఫికెట్‌ ఉందని, తననెవరూ ఏం చేయలేరని, ఏ కేసులూ నిలవవని చెబుతుండేవాడని ఆటోవాలాలు స్థానికులు  తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement