ముందెన్నడూ చూడలేదు: రాంచి పిచ్‌పై స్టోక్స్‌ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

Ind vs Eng: రాంచి పిచ్‌పై స్టోక్స్‌ కీలక వ్యాఖ్యలు.. నాకేం అర్థం కావడం లేదు!

Published Thu, Feb 22 2024 11:38 AM

Never Seen Something Like That Before: Stokes Reacts to Ranchi Pitch IND vs ENG - Sakshi

Ind vs Eng Test series 2024: భారత గడ్డపై కూడా ‘బజ్‌బాల్‌’ అంటూ దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్‌కు రెండో టెస్టులోనే తత్వం బోధపడింది. హైదరాబాద్‌ టెస్టులో విజయం తర్వాత అదే జోరును కొనసాగిద్దామని భావించిన స్టోక్స్‌ బృందానికి దిమ్మతిరిగే షాకిచ్చింది రోహిత్‌ సేన.

విశాఖపట్నం, రాజ్‌కోట్‌ టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ వంటి సీనియర్లు లేకున్నా ఆ లోటు కనబడనివ్వకుండా వరుస విజయాలతో జోష్‌లో ఉంది.

ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి జార్ఖండ్‌ వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ రాంచి పిచ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తానెన్నడూ ఇలాంటి పిచ్‌ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

నాలుగో టెస్టు కోసం ఎలాంటి ట్రాక్‌ రూపొందించారో అర్థం చేసుకోలేకపోతున్నానని.. ఆ పిచ్‌ను అంచనా వేయడం కష్టంగా ఉందని స్టోక్స్‌ పేర్కొన్నాడు. బీబీసీ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పిచ్‌ ముందెన్నడూ చూడలేదు. అసలు అక్కడ మ్యాచ్‌ ఎలా సాగనుందో అంచనా వేయలేకపోతున్నా.

ఒకవైపు నుంచి పచ్చగా.. గ్రాసీగా కనిపిస్తోంది. మరోవైపు ఎండ్‌ నుంచి చూస్తే.. అదీ నిశితంగా గమనిస్తే.. చిన్న చిన్న పగుళ్లు కనిపిస్తున్నాయి. ఆ పిచ్‌పై ఎలా ఆడాలో నాకైతే అర్థం కావడం లేదు’’ అని బెన్‌ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. కాగా హైదరాబాద్‌లో కాస్త స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌.. విశాఖ, రాజ్‌కోట్‌లో జరిగిన తదుపరి రెండు మ్యాచ్‌లలో స్పిన్నర్లతో పాటు పేసర్లకూ మేలు చేకూర్చింది. 

తొలి టెస్టులో ఇరు జట్ల స్పిన్నర్లు కలిపి 32 వికెట్లు తీస్తే.. పేసర్లకు ఆరు వికెట్లు మాత్రమే దక్కాయి. ఇక రెండో టెస్టులో స్పిన్‌ బౌలర్లకు 21 వికెట్లు దక్కితే.. ఫాస్ట్‌బౌలర్లు 15 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక మూడో మ్యాచ్‌లో స్పిన్నర్లు 24, పేసర్లు 11 వికెట్లు పడగొట్టారు.

చదవండి: వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది: బాబర్‌పై మండిపడ్డ హఫీజ్‌

Advertisement
Advertisement