పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు | CM Revanth Reddy at IPS officers get to gather | Sakshi
Sakshi News home page

పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు

Feb 2 2024 3:55 AM | Updated on Feb 2 2024 9:20 AM

CM Revanth Reddy at IPS officers get to gather - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థికంగా, సామాజికంగా ధ్వంసమైన తెలంగాణను పునర్‌నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎస్‌ అధికారుల గెట్‌ టు గెదర్‌ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారు. పోలీసులను సబార్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకొనిపోతామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ద్ధి, పునర్‌నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని తెలిపారు. 

పోలీసుల పాత్ర క్రియాశీలకం కావాలి..  
గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ఈ పనిలో పోలీసు ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ క్రయ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేయాలని సూచించారు.

అలాగే సైబర్‌ నేరాలు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఆఫీసర్లను సీఎం కోరారు. ఇందుకోసం అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారని సీఎం అభినందించారు.

పోలీసుల సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, అడిషనల్‌ డీజీ శివధర్‌రెడ్డి, సీఐడీ అడిషనల్‌ డీజీ షికా గోయల్, హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement