breaking news
Get to Gathers
-
పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా, సామాజికంగా ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎస్ అధికారుల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారు. పోలీసులను సబార్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకొనిపోతామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ద్ధి, పునర్నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని తెలిపారు. పోలీసుల పాత్ర క్రియాశీలకం కావాలి.. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ఈ పనిలో పోలీసు ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ క్రయ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఆఫీసర్లను సీఎం కోరారు. ఇందుకోసం అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారని సీఎం అభినందించారు. పోలీసుల సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ షికా గోయల్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
విస్తరిస్తున్న విషసంస్కృతి..!
♦ సిటీలో గెట్ టు గెదర్స్ పేరుతో విశృంఖలత్వం ♦ స్టార్ హోటల్స్ వేదికగా విపరీత పోకడలు ♦ నిబంధనలు పట్టించుకోని వ్యాపారులు ♦ పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం ♦ ఏదైనా ఉదంతం జరిగినప్పుడే హడావుడి సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రుల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. వ్యాపారుల స్వార్థం.. వెరసి నగరంలో చాపకింద నీరులా ఓ విషసంస్కృతి విస్తరిస్తోంది. ముక్కుపచ్చలారని మైనర్లు గెట్ టుగెదర్స్ పేరుతో విశృంఖలత్వానికి తెరతీస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్యోదంతం ఈ భయంకరమైన చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దేవి ఉదంతం, జూలైలో చోటుచేసుకున్న రమ్య కుటుంబానికి జరిగిన ప్రమాదం సైతం అధికార యంత్రాంగంలో మార్పు తీసుకురాలేదు. ఫలితంగా ఇప్పటికీ అనేక పబ్స్, స్టార్ హోటల్స్ నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. మైనర్ల మూడు రోజుల ‘కలయిక’.. చాందినికి స్నేహితుడైన ఓ మైనర్ ఫేస్బుక్లో ‘నేషనల్ డిప్లొమాట్స్’పేరుతో పేజ్ ఏర్పాటు చేశారు. ఇందులోని సభ్యుల్లో 52 మంది గెట్ టుగెదర్‌కు ఏర్పాటు చేసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు లక్డీకాపూల్‌లోని ఓ స్టార్ హోటల్ దీనికి వేదికైంది. మైనర్లకు నిర్వాహకులు 23 గదులు కేటాయించారు. పగలంతా అకడమిక్ సదస్సులు జరిగినా.. సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. పబ్స్, మద్యపానం, సోషలైజింగ్ పేరుతో బాలబాలికల గదుల మార్పిడి జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. ఈ ‘గెట్ టుగెదర్’లో చాందినితో పాటు ఆమె కేసులో నిందితుడిగా ఉన్న బాలనేరగాడు సైతం పాల్గొన్నాడు. అక్కడ చాందినికి మరో మైనర్‌తో అయిన పరిచయమే పరిస్థితిని హత్య వరకు తీసుకెళ్లింది. అప్పట్లో పోలీసులేమన్నారు? పబ్స్‌తో పాటు మద్యం సరఫరా విషయంలో పక్కాగా వ్యవహరిస్తామని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. కొన్ని రోజుల పాటు తనిఖీలు, కేసుల నమోదు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ స్థాయి నిఘా, అధికారుల చర్యలూ అటకెక్కాయి. నగరంలోని పబ్స్‌లో రాత్రి 12 గంటల వరకు మ్యూజిక్ ప్లే చేయడానికి, తెల్లవారుజాము ఒంటి గంట వరకు పబ్ నడవడానికి అనుమతులు ఉన్నాయి. మైనర్లు వీటిలోకి వెళ్లడం, మద్యం సేవించడం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. సంపన్నుల పిల్లలకు గాలం వేస్తున్న కొందరు దళారులు స్టార్ హోటల్స్, రిసార్ట్స్ వేదికగా ఇలాంటి విపరీత వ్యవహారాలను నిర్వహిస్తున్నా యంత్రాంగాల్లో స్పందన కరువైంది. చాందిని వ్యవహారం వెలుగులోకి వచ్చే వరకు అసలు ఇలాంటి సంస్కృతి ఉన్నట్లు పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. ఇలాంటి విషసంస్కృతికి చెక్ చెప్పాలంటూ పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ ఉండాలన్నది నిపుణుల మాట. వారి కదలికల్ని కనిపెట్టడంతో పాటు వారి ఇంటర్నెట్, సోషల్‌మీడియా వ్యవహరాల్లో గోప్యత లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. రమ్య కుటుంబాన్ని చిదిమారిలా.. నగరానికి చెందిన విద్యార్థులు ఎన్.సూర్య, విష్ణు, శ్రావెల్, అశ్విన్, సాయి రమేశ్, అలెన్ జోసెఫ్ గత ఏడాది జూలై 1న బంజారాహిల్స్‌లోని సినీమ్యాక్స్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు. విష్ణు తండ్రికి చెందిన ఐ10 కారులో అక్కడికి వెళ్లారు. సినిమా చూడటం సాధ్యపడక పోవడంతో మాల్లోనే ఉన్న టీజీఐ ఫ్రైడే బార్లో ఫూటుగా మద్యం తాగారు. బార్ నిర్వాహకులు నిబంధనలకు తిలోదకాలిస్తూ 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నా మద్యం సరఫరా చేశారు. తిరిగి వస్తున్న సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ లేని శ్రావెల్ వాహనాన్ని నడుపుతూ పంజగుట్ట శ్మశాన వాటిక వద్ద రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి కారకుడ య్యాడు. ఈ ఘటన మూడు ప్రాణాలు తీయడంతో పాటు నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇలా.. జూబ్లీహిల్స్‌లోని డీకే నగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని కె.దేవి, మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చెందిన సామ భరత్‌సింహారెడ్డి రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయమయ్యారు. గత ఏడాది ఏప్రిల్ 30 రాత్రి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న బీట్స్ పర్ మినిట్స్ పబ్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. దేవితో పాటు ఆమె స్నేహితురాలు సోనాలీ సైతం వెళ్లింది. పార్టీ పూరై్తన తర్వాత తెల్లవారుజామున 2.45 గంటలకు దేవి, భరత్, సోనాలీ పబ్ నుంచి బయటకు వచ్చారు. మద్యం మత్తులో దేవిని తీసుకుని కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న భరత్ చేసిన ప్రమాదం ఆమె ప్రాణాలు తీసింది.