‘మంగళగిరి’లో టీడీపీ దాష్టీకం | Attack On YSRCP Leaders Campaigning For Elections In Guntur District, Details Inside - Sakshi
Sakshi News home page

‘మంగళగిరి’లో టీడీపీ దాష్టీకం

Published Fri, Apr 19 2024 5:20 AM

Attack on YSRCP leaders campaigning for election - Sakshi

ఓటమి భయంతో బరితెగించిన లోకేశ్‌  అనుచరులు.. ఎన్నికల ప్రచారం చేస్తున్న  వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి  

ఆపై ద్విచక్రవాహనంతో ఢీకొట్టిన టీడీపీ దుండగులు.. వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ కన్వినర్‌కు తీవ్ర గాయాలు  

పరిస్థితి విషమం.. 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమంటున్న వైద్యులు   

తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు వీరంగం చేశారు. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌కు, ఆయన అనుచరులకు ఓటమి భయం పట్టుకోవడంతో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్‌ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులను దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ నేత మేకా వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

స్థానిక సీఎస్‌ఆర్‌ రోడ్‌లో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం చేయ­వద్దన్నారు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాలపై వచ్చినవారు.. ఇక్కడ లోకేశ్‌ గెలవాలంటూ కేకలు వేశారు. టీడీపీకి, లోకేశ్‌కు అనుకూలంగా, వైఎస్సా­ర్‌సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌ మేకా వెంకటరెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ కృష్ణారెడ్డి తదితరుల చుట్టూ ద్విచక్ర వాహనాలను తిప్పారు. వీరిని పట్టించుకోకుండా వైఎస్సార్‌సీపీ నాయకు­లు, కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం కొనసాగించారు.

ఈ క్రమంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి బూతులు తిడుతూ ఎన్నిసార్లు చెప్పాలిరా ప్రచారం చేయవద్దని అని అంటూ దురుసుగా ప్రవర్తించాడు. జేసీఎస్‌ కన్వీనర్‌ కృష్ణారెడ్డి కలగజేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపొ­మ్మనడంతో అతడిపై దాడిచేశారు. అంతలో మరో ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చా­రు. వారిలో ఒక యువకుడు మోటారు సైకిల్‌తో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఢీకొట్టా­డు. ముగ్గురు వైఎస్సార్‌సీపీ నాయకులు, బూత్‌ కన్వీనర్లు రోడ్డుపై పడిపోయా­రు. కుంచనపల్లికి చెందిన బూత్‌ కన్వీనర్‌ మేకా వెంకటరెడ్డిని మరోసారి ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో ఆయన కిందప­డిపోయారు.

తలకు తీవ్రంగా గాయమైంది. వచ్చిన ఆరుగురిలో ఇద్దరు యువకులు రోడ్డుపై రక్తపుగాయాలతో ఉన్న మేకా వెంకటరెడ్డిని కాళ్లతో తన్నారు. వెంకటరెడ్డిని కొడుతుంటే ఆపేందుకు వెళ్లిన వైఎస్సా­ర్‌సీపీ కార్యకర్తలపై దాడిచేసి కొట్టి ద్విచక్ర వాహనాలపై పరారయ్యా­రు. ద్విచక్ర వాహనంపై పారిపోతున్న వారిలో ఒక యువకుడిని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టుకున్నారు. అది గమనించిన టీడీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై వెనక్కివచ్చి పట్టుకున్న వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో పట్టుబడిన వ్యక్తి విడిపించుకుని పరారయ్యాడు. తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిన వెంకటరెడ్డిని తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులను అడిగి వెంకటరెడ్డి పరిస్థితి తెలుసుకున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు తెలిపారు. 

బయటి నుంచి దించారు 
ఓటమి భయంతో ఉన్న టీడీపీ నేతలు ఇప్పటికే బయట ప్రాంతాల నుంచి పలువురిని తీసుకొ­చ్చా­రు. కొందరు స్థానికులు, బయట నుంచి వచ్చి­నవారు కలిసి ఈ దాడికి పాల్పడినట్లు అనుమా­నాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు వచ్చిన ద్విచక్ర వాహనాల్లో ఒకటి ఏపీ 39 ఎఫ్‌వై 2192 నంబరుతో ఉంది.

ఇది విశాఖ అడ్రస్‌తో ఉందని తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాల­సోమిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి లోకేశ్‌ నియోజకవర్గంలో ప్రచారం చేసే సమయంలో వారి కార్యకర్తలను రెచ్చగొడు­తూ ప్రసంగించారని, ఎవరూ ఎక్కడా తగ్గవద్దు.. నేను చూసుకుంటానంటూ చెప్పారని గుర్తుచేశారు. లోకేశ్‌ అలా మాట్లాడబట్టే ఆ పార్టీ వారు ఇలా దాడులు చేస్తున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement