5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ | Sakshi
Sakshi News home page

5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

Published Sat, Sep 30 2023 4:13 AM

Krishna board three member committee meeting on 5th - Sakshi

సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితులవల్ల దిగువ కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున­సాగర్‌లలో నీటి నిల్వలు కనిష్టంగా ఉన్న నేపథ్యంలో మే 31 వరకూ తాగునీటి అవసరాలపై చర్చించేందుకు హైదరా­బాద్‌లో అక్టోబర్‌ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా బోర్డు నిర్వహించనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి మే 31 వరకూ తాగునీటి అవసరాలకు ఎన్ని నీళ్లు అవసరమో అక్టోబర్‌ 3లోగా ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలకు కోరింది. కమిటీలో సభ్యులందరూ ఈ సమా­వేశంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది.

ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి లభ్యతను బట్టి, రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుని నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డుకు సిఫార్సు చేయడానికి సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు సభ్యులు­గా త్రిసభ్య కమిటీని కృష్ణాబోర్డు ఛైర్మన్‌ ఏర్పా­టుచేశారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటి­సారిగా జూలైలో సమావేశమైన త్రిసభ్య కమిటీ.. తాగునీటి అవసరాల కోసం రెండు ప్రాజెక్టుల నుంచి 12.7 టీఎంసీలను విడుదల చేయాలని సిఫార్సు చేయడంతో ఆ మేరకు నీటి విడుదల ఉత్తర్వులను జూలై 21న కృష్ణా బోర్డు జారీచేసింది.

ఆ తర్వాత ఆగస్టు 21, 24న త్రిసభ్య కమిటీ రెండోసారి సమావేశమైంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటినిల్వ తక్కువగా ఉన్న నేపథ్యంలో.. తాగునీటి అవసరాల కోసం నిల్వచే­యాలని రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. తాగు­నీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు పంపిన ప్రతి­పాదనలపై సంప్రదింపులు జరపకపోవడంతో అప్పట్లో నీటి విడుదల ఉత్తర్వులను కృష్ణాబోర్డు జారీచేయలేదు.

ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ దృష్టికి సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తీసుకెళ్లారు. తక్షణమే త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించి.. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలను చర్చించి.. నీటి కేటాయింపులకు సిఫార్సు చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్‌ ఆదేశించారు.  దాంతో అక్టోబర్‌ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహి­స్తున్నట్లు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement