గుర్తుతెలియని వాహనం ఢీకొని భర్త మృతి
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో గుర్రప్పతోట గ్రామం వద్ద శుక్రవారం మోటారుబైక్‌లో వెళుతున్న భార్యభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో గోపి(32) అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్య శైలజకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉందిజ స్థానికులు కథనం మేరకు పెళ్లకూరు మండలంలోని యడపూడి గ్రామానికి చెందిన గోపి కొంత కాలంగా మేనకూరు గ్రామం ఎన్‌టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి కొత్తూరు గిరిజన కాలనీలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైన దంపతులు శుక్రవారం మోటారుబైక్‌లో తిరిగి మేనకూరుకు బయలుదేరారు. మార్గం మధ్యలో గుర్రప్పతోట గ్రామం వద్ద గుర్తు తెలియని వాహనం మోటారుబైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. శైలజకి తీవ్ర గాయాలు కావడంతో అపస్మారకస్థితికి వెళ్లింది. స్థానికులు గుర్తించి 1033 వాహనంలో క్షతగాత్రురాలిని శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని భర్త మృతి


