నేటి నుంచి మహాసంప్రోక్షణ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ అనుబంధంగా ఉన్న నాగలాపురం శ్రీ వేదవళ్లి సమేత వేదనారాయణస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ నిర్వహించనున్నట్లు టీటీ డీ సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, పుణ్యహం మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించనున్నారు. ఈ నెల 18న ఉదయం అష్ట బంధన సమర్పణ, సాయంత్రం పుణ్యాహం, పంచాగ్ని ప్రతిష్ఠ, కుంభ వాహనం, ఆరాధన, హోమం, పూర్ణాహుతి, 19న పంచ గవ్యాధివాసం, నవ కలశ స్నపనం నిర్వహించనున్నారు. 20న ఉదయం క్షీరాబ్దివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, 21న ఉదయం జలాధివాసం, సాయంత్రం మహా శాంతి తిరుమంజనం జరగనుంది. 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణం, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గర్భాలయ మూలవర్ల మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.
శ్రీవారి దర్శనానికి 10గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరు గా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఆదివారం 80,502 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,608 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


