
గుంటూరు, సాక్షి: మహిళ అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదని.. అందుకే ఈ పాలనలో రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం(మార్చి 8న) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి.
ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. కానీ, కూటమి ప్రభుత్వం ఈ నవ మాసాల్లో నవ మోసాలు తీసుకొచ్చింది’’ అని అన్నారామె.
‘‘ఏపీలో మహిళలు.. చంద్రబాబు మోసాలపై ఆగ్రహంతో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారు. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయి. సూపర్ సిక్స్ పేరుతో మహిళలను మోసం చేసి నట్టేట ముంచారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. రోజుకు 70 మంది మహిళలు, వృద్దుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో దిశా పీఎస్‌లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించారు. చంద్రబాబు మళ్లీ యాభై వేలకు పైగా బెల్టుషాపులు పెట్టారు’’ అని ఆర్కే రోజా మండిపడ్డారు.
‘‘తల్లికివందనం పేరుతో మహిళలకు పంగనామం పెట్టారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?. నిరుద్యోగ మహిళలు, యువతులను చంద్రబాబు మోసం చేశారు. మహిళలు తిరగబడతారని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే శక్తియాప్ పేరుతో యాప్‌ని తెస్తున్నారు. జగన్ తెచ్చిన దిశా యాప్‌ని చంద్రబాబు కాపీ కొట్టారు. మహిళా భద్రత గురించి కేబినెట్‌లో ఏనాడూ చర్చించలేదు. కానీ గంజాయి, మద్యం వ్యాపారుల ప్రయోజనాల గురించి చర్చించారు. చంద్రబాబు, అనిత సొంత నియోజకవర్గాల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు. 30 వేలమంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కే చెల్లింది
..సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారు?. కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేకపోయారు?. కనీసం సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు?. జనసేన నేతల చేతిలో మోసపోయిన మహిళలకి ఏం న్యాయం చేశారు?. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు పవన్ కళ్యాణ్‌కి లేదు. మహిళల కన్నీటి శాపనార్థాలకు కూటమి ప్రభుత్వం పతనం అవుతుంది. ఉచిత బస్సు పేరుతో అన్యాయం చేశారు. తగిన సమయంలో మహిళలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారు’’ అని రోజా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment