కృష్ణానదిలో ఫైర్ సిబ్బందికి శిక్షణ పూర్తి
మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఫైర్ సర్వీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి.వెంకట రమణ ఆదేశాలతో తాడేపల్లి ఉండవల్లి కరకట్ట వెంబడి వున్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్ద పలువురు ఫైర్ సిబ్బంది స్విమ్మింగ్, వాటర్ రెస్క్యూ యాక్టివిటీస్‌పై శిక్షణ తీసుకున్నారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి విచ్చేసి సమీక్షించారు. ఆయన ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఫైర్ సిబ్బంది నదిలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో వాటర్ రెస్క్యూ మెథడ్ ద్వారా చేసి చూపించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సిబ్బంది నదిలో నీటిలోతును, ప్రవాహ వేగాన్ని అంచనా వేసి బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ సహాయ అధికారి నరసింహారావు, మంగళగిరి ఫైర్ ఆఫీసర్ వై.వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


