గండాలయ స్వామి ఆలయంలో ప్లాస్టిక్ నిషేధం
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండపై పర్యావరణ పరిరక్షణకై ఆలయ అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. 17వ తేదీ మంగళవారం అమావాస్యను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్ధం ఘాట్‌రోడ్ ద్వారా గండదీపానికి వెళ్లే మార్గంలో వాహనాలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్ కుమార్ తెలిపారు. కొండపై ప్లాస్టిక్ వినియోగం నియంత్రణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు తదితర వస్తువులను గండాలయ స్వామి ఆలయ ప్రాంతంలో నిషేధించామని పేర్కొన్నారు. స్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తులు శ్రీ గండాలయస్వామి వారి సన్నిధికి ప్లాస్టిక్ సామగ్రిని తీసుకురావద్దని ఆయన కోరారు. ఆలయ పరిశుభ్రతను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానానికి తిరునాళ్ల సందర్భంగా హుండీ ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్లు దేవదాయశాఖాధికారులు తెలిపారు. వడ్లమూడి క్వారీ దేవస్థానం వద్ద సోమవారం దేవదాయశాఖాధికారులు హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. భక్తులు హుండీలో వేసిన కానుకలను, ఇతర ఆదాయాలను దేవదాయశాఖాధికారులు, స్థానిక పెద్దల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. మొత్తం రూ.17.30లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖాధికారి నరసింహరావు తెలిపారు. వీటిలో హుండీల ఆదాయం రూ.6,03,208లు, అభిషేకం, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.7,40,500లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరికాయలకు రూ.2.95లక్షలు, గ్యాస్ పొయ్యిలకు రూ.34,500లు, డొనేషన్స్ రూ.57,390ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. దేవస్థానానికి మొత్తంగా రూ. 17.30లక్షలు సమకూరింది. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం రూ.1.03లక్షలు అదనంగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు అంచనా వేశారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయ శాఖాధికారులు, పోలీసు, రెవెన్యూ శాఖాధికారులు, గ్రామస్తులు, స్థానిక పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, రక్త పరీక్షా కేంద్రాలు, స్కానింగ్ కేంద్రాల యాజమాన్యం, సిబ్బంది, వారి వద్ద పనిచేస్తున్న వైద్యుల హెచ్‌పీఆర్ ఐడీలు, వైద్య సంస్థల హెచ్‌ఎఫ్‌ఆర్ ఐడీలను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సోమవారం తెలిపారు. ఈప్రక్రియ 30 రోజుల్లోపు పూర్తి చేసుకోకపోతే, ఆసుపత్రులు, రక్త పరీక్షా కేంద్రాలు, స్కానింగ్ కేంద్రాల లైసెన్సులు చెల్లనివిగా భావిస్తామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలన్నారు. మధ్యవర్తుల ద్వారా సందేశాలు, బట్వాడా ద్వారా పంపడం వంటి చర్యలను నేరపూరిత చర్యగా భావిస్తామని టవెల్లడించారు.


